Shreyas Iyer 2nd ODI vs Eng : టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ వల్ల ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. విరాట్ స్థానంలో చోటు దక్కించుకున్న అయ్యర్ అర్ధశతకంతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండో వన్డేలో విరాట్ తిరిగి వస్తే అయ్యర్‌కు జట్టులో చోటు ఉండదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు.
రెండో వన్డేలో అయ్యర్‌ను జట్టులోంచి తప్పించాలని ఆలోచించడం సరైంది కాదని అన్నాడు. ఎవరూ ఊహించనిది అతడు సాధించాడని అన్నాడు. తొలి వన్డేలో రాణించి, సిరీస్‌లో భారత్‌ను ఆధిక్యంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'శ్రేయస్ అయ్యర్ తానేంటో నిరూపించుకున్న ఆటగాడు. అతడిని జట్టులో నుంచి పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారన్న విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది జరిగిన వరల్డ్ కప్‌లో చాలా పరుగులు చేశాడు. ఓ ఆటగాడు భారీగా పరుగులు చేస్తే అవకాశాలు వస్తాయని అనుకుంటాం. అతడు తన నుంచి బెస్ట్ ఇచ్చాడు. అందుకే దేవుడు మళ్లీ శ్రేయస్‌కు అవకాశం ఇచ్చాడు. మేనేజ్ మెంట్ జట్టులో చోటివ్వకపోయినా అతడికి ఆడే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే 50 పరుగులకు పైగా చేసి మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. అలా ఎవరూ ఊహించనిది అతడు చేశాడు' అని భజ్జీ వ్యాఖ్యానించాడు.
పంత్ ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే
రిషబ్ పంత్ చాలా మంచి ఆటగాడని కొనియాడాడు హర్భజన్ సింగ్. అయితే అవకాశాల కోసం పంత్ కొన్నాళ్లు వేచి ఉండాల్సిందేనని అన్నాడు. 'ప్రస్తుతం టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్న విధానం ప్రకారం వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోటాలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసేందుకు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి రిషబ్ పంత్ అవకాశం కోసం వేచి ఉండాలి. కేఎల్ రాహుల్ బాగా రాణిస్తాడని ఆశిస్తున్నాను. పంత్‌కు కూడా త్వరలో అవకాశాలు వస్తాయి. అప్పటివరకు వేచి ఉండాలి. ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్ కూడా లైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగా రాణిస్తుందని అనుకుంటున్నాను' అని భజ్జీ తెలిపాడు.
రెండో వన్డే తుది జట్టులోకి నయా లెఫ్ట్‌హ్యాండర్! - ఇక పంత్‌కు ప్లేస్ లేనట్లేనా?
'ధోనీ, రోహిత్‌లా పంత్ పేరూ వింటారు! - కనీసం ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధిస్తాడు'