IND vs ENG 5th T20I : ఐదో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలింది. 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా 4-1తో విజయవంతంగా ముగించింది. ఇంగ్లాండ్ టీమ్‌లో ఫిల్ సాల్ట్ 55(23), జాకబ్ బెతల్ 10(7)లు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా- వరుణ్ చక్రవర్తి, శివమ్‌దుబే, అభిషేక్‌శర్మలు రెండేసి వికెట్లు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు ఫిల్ సాల్ట్ 55(23) దూకుడుగా ఆడి శుభారంభాన్ని ఇచ్చాడు. సాల్ట్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, టీమ్ఇండియా బౌలర్లు విజృంభించడం వల్ల కెప్టెన్ బట్లర్ 7(7) సహా మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. దీంతో ఐదో ఓవర్ నుంచి ప్రతి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. బెన్ డకౌట్ 0(1), హ్యారీ బ్రూక్ 2(4), లివింగ్‌స్టన్ 9(5), జాకబ్ బెతల్ 10(7), బ్రైడన్ కార్స్ 3(4), ఒవర్టన్ 1(3), జోఫ్రా ఆర్చర్ 1(2), రషీద్ 6(6), మార్క్ వుడ్ 0(1)కే పరిమితమయ్యారు.
అంతకుముందు, బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అభిషేక్ సునామీ సెంచరీ(135)తో అదరగొట్టాడు. ఓ దశలో 280+ పరుగులు సులభంగా వస్తాయనుకున్నా అభిషేక్‌కు తిలక్ (24), దూబె (30) మినహా ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో 235తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాంసన్ (16), సూర్య (2), పాండ్య (9), రింకు (9) నిరాశపరిచారు . అక్షర్ (15) ఆఖరులో వేగంగా ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3, వుడ్ 2, ఆర్చర్, రషీద్, ఒవర్టన్ తలో వికెట్ తీశారు.