Congress Leaders Protest At Tank Bund : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదన్నారు.
పార్టీలకు అతీతంగా కలిసి రావాలి : తెలంగాణ అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఏకతాటిపైకి రావాలిసిన అవసరం ఉందని మంత్రులు సీతక్క, పొన్నం అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినప్పటికీ నిధులను రాబట్టడంలో వారు పూర్తిగా విఫలం చెందారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహా మంత్రులు పలు దఫాలుగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగినప్పటికీ నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ది కోసం రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. కేంద్ర నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
"నిధుల కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏటా అన్యాయం జరుగుతోంది. జీడీపీలో(స్థూల దేశీయోత్పత్తి) రాష్ట్ర వాటా 5 శాతం ఉన్నా తెలంగాణకు ఎప్పుడూ మొండిచేయే. కేంద్రంపై యుద్ధం ప్రకటించి తెలంగాణకు నిధులు సాధించాలి. అన్ని పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. "- మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని , పార్టీలకు అతీతంగా అందరం ఏకమై రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు కార్పోరేషన్ ఛైర్మన్లు ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే - ప్రత్యేకంగా ఏదీ రాలేదు