How to Make Mustard Rice: ఆవాలు.. ప్రతి కూరల్లో వీటిని తప్పనిసరిగా ఉపయోగిస్తాం. కూరల రుచిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. గుండె ఆరోగ్యం నుంచి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఆవాలను కేవలం కూరల్లో తాలింపుకు మాత్రమే వాడకుండా.. ఓసారి ఆవాలతో అన్నం చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్‌లకు వెరైటీగా ఏమైనా చేయాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. పైగా కలర్ఫుల్గా, టేస్టీగా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 1 కప్పు
- నూనె - 1 టీ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- ఎండు మిర్చి - 10
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్
- పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
- నూనె - పావు కప్పు
- పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- పొట్టు మినపప్పు - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్లో వేయాలి. అందులోకి నూనె, కొద్దిగా ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ను పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్, లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయేంతవరకు పక్కన పెట్టాలి.
- కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఓ సారి నిధానంగా కలపాలి.
- మిక్సీజార్ తీసుకుని అందులోకి ఎండుమిర్చి, ఆవాలు, పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. అయితే ఉప్పును ముందే అన్నం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి.. ఇక్కడ చూసి వేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వేసి వేయించుకోవాలి.
- తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చికొబ్బరి పేస్ట్‌ను వేసి సిమ్‌లో పెట్టి నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.
- ఈ క్రమంలో పేస్ట్ ముద్దగా మారుతుంది. అప్పుడు ఉడికించిన రైస్ వేసుకుని అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత నెయ్యి వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవాల అన్నం రెడీ.
- ఇందులో కావాలంటే జీడిపప్పు, పల్లీలు కూడా వేయించి తీసుకోవచ్చు. నచ్చితే మీరూ ఈ రెసిపీ ట్రై చేయండి.
లంచ్ బాక్స్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్" - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!