Bus Driver Locks Kit Bag Of Players : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫ్రాంచైజీ దర్బార్ రాజ్ షాహీకి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్ల కిట్ బ్యాగ్ లను బస్సు డ్రైవర్ లాక్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన జీతం బకాయిలను ఫ్రాంచైజీ చెల్లిస్తేనే ఆటగాళ్ల కిట్లకు లాక్ తీస్తానని చెప్పాడు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
అసలేం జరిగిందంటే?
దర్బార్ రాజ్ షాహీ ఆటగాళ్లకు యాజమాన్యం ఫీజు చెల్లించలేదని వార్తలు వచ్చాయి. దీంతో ఆ జట్టుకు చెందిన విదేశీ ప్లేయర్లు మ్యాచ్ ను బహిష్కరించి స్వదేశాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దర్బార్ రాజ్ షాహీ ఫ్రాంచైజీ వివాదంలో చిక్కుకుంది. మహ్మద్ హారిస్ (పాకిస్థాన్), అఫ్తాబ్ ఆలం (అఫ్గానిస్థాన్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), ర్యాన్ బర్ల్ (జింబాబ్వే), మిగ్యుల్ కమిన్స్ (వెస్టిండీస్)లకు దర్బార్ రాజ్ షాఫీ ఫ్రాంచైజీ ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వారిలో ఇద్దరు మాత్రమే 25 శాతం ఫీజును అందుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బహిష్కరించాలని ఆటగాళ్లు నిర్ణయించుకోవడం వల్ల వివాదం చెలరేగింది.
దర్బార్ రాజ్ షాహీ ఫ్రాంచైజీకి చెందిన ఫారిన్ ప్లేయర్లు వారికి ఇవ్వాల్సిన ఫీజు, విమాన టికెట్ల కోసం ఎదురుచూస్తూ హోటల్ గదులలో ఉండిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వారికి విమాన టికెట్లు బుక్ చేశామని దర్బార్ రాజ్ షాహీ జట్టు యజమాని షఫీక్ రహ్మా మీడియాకు తెలియజేశారు. అయితే ఆటగాళ్ల కిట్ బ్యాగ్ ను తిరిగి ఇవ్వడానికి బస్సు డ్రైవర్ నిరాకరించడం వల్ల కొత్త ట్విస్ట్ బయటపడింది. ఫ్రాంచైజీ ఆటగాళ్లకే కాదు బస్సు డ్రైవర్ కు బకాయిలు చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు ఆటగాళ్ల కిట్ లను లాక్ వేశాడని తెలుస్తోంది.
"ఇది విచారకరం. అవమానకరమైన విషయం. దర్బార్ రాజ్ షాఫీ ఫ్రాంచైజీ నాకు బకాయిలు చెల్లించినట్లైతే ఆ జట్టు ఆటగాళ్ల కిట్ బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పటివరకు నేను నోరు విప్పలేదు. నాకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వాలి. స్థానిక, విదేశీ క్రికెటర్ల కిట్ బ్యాగులు బస్సులో ఉన్నాయి. నా ఫీజులో ఎక్కువ భాగం ఇంకా నాకు అందలేదు." అని రాజశాసి జట్టు బస్సు డ్రైవర్ మహ్మద్ బాబుల్ వ్యాఖ్యానించారు.