Millets For Good Health : ఒక గ్లాసు రాగిజావ పోషకాలపరంగా చూస్తే మూడు గ్లాసుల పాలతో సమానమని, చిన్న పిల్లలకు రాగిజావ, జొన్నరొట్టె లాంటి మంచి పోషకాలను ఇప్పటి నుంచే అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ సి.తారాసత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరు తమ రోజువారీ ఆహారంలో మూడో వంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో భారత సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25 శాతం చిరుధాన్యాలను వినియోగిస్తోందని, ఈ చైతన్యం అన్ని రంగాల్లో రావాలని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి 09న) ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం)లోనూ వీటిని చేర్చాలని సూచించారు. రైతులకు ప్రధాన పంటల కంటే చిరుధాన్యాల సాగు మరింత లాభదాయకమని డాక్టర్ తారాసత్యవతి వివరించారు.
దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు ఎలా ఉన్నాయి?
మారుతున్న కాలంలో చిరుధాన్యాలపై ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. సాగు కూడా పెరుగుతోంది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం తర్వాత వాటి ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం మంచి పరిణామం. వీటితో విభిన్న రకాల ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి కూడా వస్తున్నాయి. వాటి కొనుగోళ్లకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మన దేశంలో 18 నుంచి 20 మిలియన్ టన్నుల మేర చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది.
ఆహార పరిశ్రమలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి?
ప్రజలకు చిరుధాన్యాలను రుచికరంగా, విభిన్న రూపాల్లో అందించడంలో ఆహార పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని చాలా వ్యాపార సంస్థలు మిల్లెట్స్‌తో చేసిన ఆహార ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వరి, గోధుమలతో మధుమేహం, ఇతర సమస్యలొస్తున్నాయనే ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నాయని తెలిసిందే. చిరుధాన్యాలతో లాభాలు తప్ప నష్టాలు అస్సలు లేవు. ఆరోగ్యపరంగా చూస్తే అన్నివిధాలా శ్రేష్ఠమైనవి. చిన్ననాటి నుంచే పిల్లలకు వీటిపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వపరంగా చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఇప్పటికే ఒడిశా సహా 12 రాష్ట్రాలు చిరుధాన్యాలపై ప్రత్యేక కమిషన్‌లను ఏర్పాటు చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో : తెలుగు రాష్ట్రాలు పూర్వం చిరుధాన్యాలకు ప్రముఖంగా పేరొందాయి. ప్రస్తుతం వాటి సాగు తగ్గింది. మళ్లీ పెద్ద ఎత్తున చిరుధాన్యాల సాగును చేపట్టాలి. గ్రామాల్లోని ప్రజలు మధుమేహం, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు. వాటికి అంతిమ పరిష్కారం చిరుధాన్యాలే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, రైతులకు, వినియోగదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు, అంకుర వ్యవస్థాపకులకు, యువతకు మా సంస్థపరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తాం.
ఐఐఎంఆర్ పరంగా ఎలాంటి కృషి జరుగుతోంది?
1958లో మొక్కజొన్న పరిశోధన డైరెక్టరేట్‌గా మా సంస్థ ఏర్పడింది. అనంతరం 2014లో ఐఐఎంఆర్‌గా మారింది. అప్పటి నుంచి చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తదితర అంశాలపై రిసెర్చ్ చేస్తోంది. ప్రస్తుతం 17 డిపార్ట్మెంట్స్లో 50 మంది సైంటిస్ట్‌లు, 200 మందికిపైగా స్టాఫ్ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో వినియోగించాలి : ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ భాగస్వామ్యం చేస్తే దేశవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగం విస్తృతస్థాయిలో పెరుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో జొన్నలు, రాజస్థాన్‌లో సజ్జలు, ఏపీలో కొర్రలు, కర్ణాటకలో రాగుల వంటివి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇవ్వాలి. పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, ఆసుపత్రుల్లోనూ ఈ ఆహార పంపిణీ జరగాలి.
ప్రధాన ఆహారంగా మారతాయా?
దేశంలో ప్రధాన పంటలు వేర్లతో సహా నాటుకుపోయాయి. వరి, గోధుమలను మాన్పించడం కష్టమే. దేశంలో 80 శాతానికి పైగా వరి, గోధుమలే సాగవుతున్నాయి. ప్రస్తుతం చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా కంటే ప్రత్యామ్నాయ, అనుబంధ ఆహారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాయితీపై విత్తనాలను ఇవ్వడానికి కేంద్రం యోచిస్తోంది. సైన్యానికి అందించే ఫుడ్‌లో 25 శాతం వరకు చిరుధాన్యాలే ఉండాలని ఆదేశించింది.
మిల్లెట్స్ బిస్కెట్లు, బెల్లం, చిరుధాన్యాలతో సాయంత్రం అల్పాహారం - కేవలం ఆ తరగతి వారికే మాత్రమే
చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి - వరదాయినిగా మారిన మిల్లెట్స్ - Millets Benefits in Daily Life