IND VS ENG 2ND ODI Kohli : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన పేలవ ప్రదర్శననే ఇచ్చాడు. ఇంగ్లాండ్ జరిగిన రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. గిల్ (60) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. ఎనిమిది బంతుల్లో ఒక బౌండరీ కొట్టాడు. అట్కిన్సన్ బౌలింగ్ తనదైన కవర్‌డ్రైవ్‌తో ఫోర్ తీశాడు. కానీ, మరింతసేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు కోహ్లీ. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా, ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్ తీసుకుంది. సమీక్షలో బంతి ఎడ్జ్ తీసుకొన్నట్లుగా తేలింది.
'అందుకే కోహ్లీ ఔట్'
భారత ఇన్నింగ్స్‌లో అదిల్ రషీద్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి విరాట్ ఔటయ్యాడు. కానీ, అంతకుముందు వేసిన బంతిని కోహ్లీ డ్రైవ్ చేశాడు. నేరుగా ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ వద్దకు వెళ్లింది. అతడు తిరిగి ఆ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. కానీ, అక్కడ విరాట్ వైపు దూసుకొచ్చింది. వెంటనే బట్లర్ కూడా క్షమాపణాలు చెబుతున్నట్లు సైగలు చేశాడు. అయితే, కోహ్లీ ఏకాగ్రతను కోల్పోయాడని, అందుకే, ఆ మరుసటి బంతికే ఔటైనట్లు అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విరాట్ కోహ్లీపై కావాలనే ఆ బంతిని విసిరినట్లు ఉందని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. కోహ్లీ ఏకాగ్రతను కోల్పోయేలా చేసేందుకు బట్లర్ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడని అన్నాడు.
అదిల్ ఖాతాలో ఓ రికార్డు
మరోవైపు విరాట్ కోహ్లీని అదిల్ రషీద్ పదోసారి ఔట్ చేయడం వల్ల ఓ రికార్డ్ నమోదు చేశాడు. భారత స్టార్ బ్యాటర్‌ను 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు ఔట్ చేసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. అతడికంటే ముందు టిమ్ సౌథీ, జోష్ హేజిల్‌వుడ్, మొయిన్అలీ, జేమ్స్ అండర్సన్ ఈ లిస్ట్‌లో ఉన్నారు.