Yadadri Collector Sudden Inspection in Gurukula School : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపల్ రాజాపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రిన్సిపల్, సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్‌లో సమస్యలపై విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆహారంలో నాణ్యత, శుభ్రత లోపిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వయంగా పరిశీలన : ఈ నేపథ్యంలో కలెక్టర్ తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. విద్యార్థులు వినియోగించే రోజువారీ నీరు ఎలా ఉందని కలెక్టర్ స్వయంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మీదకు ఎక్కి పరిశీలించారు. నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ఆరా తీశారు.
తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ : ప్రిన్సిపల్, స్టాఫ్‌తో కలెక్టర్ హనుమంతరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పలు విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజులలో అందరీ పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. విద్యార్థులతో వంటపనుల్లో పనిచేయిస్తే చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థులతో అర్థమయ్యేట్లు మాట్లాడి వారి ప్రతిభ ఆధారంగా పాఠాలు చెప్పాలని సూచించారు.
సమస్యలు చెప్పిన విద్యార్థినులు : అనంతరం హాస్టల్ విద్యార్థినులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాత్రూమ్స్‌లో రాత్రి వేళల్లో లైట్స్ లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన బాత్రూమ్స్‌లో లైట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు కోతులతో ఇబ్బందిగా ఉంది అని తెలిపారు. వెంటనే సోలార్ పెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని ఏఈ పంచాయతీ రాజ్‌కి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. విద్యార్థినులకు హనుమంతరావు గణితంలోని లెక్కలను ప్రశ్నలుగా అడిగి తెలుసుకున్నారు.
నాణ్యమైన సరుకులు వాడాలి : విద్యార్థినులకు పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్‌ను ఆదేశించారు. భోజనం తయారుచేయాడానికి నాణ్యమైన సరుకులు వాడాలని సూచించారు. కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులు ఇవ్వకపోతే వార్డెన్ వాటిని వెంటనే తిరస్కరించాలని చెప్పారు. ఆహారంలో నాణ్యత, శుభ్రత లోపిస్తే చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. ఆర్డీఓ పర్యవేక్షణలో పాఠశాలలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలని డీఎంహెచ్ఓకి ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థి ఇంటి డోర్ కొట్టిన జిల్లా కలెక్టర్ - మంచి మార్కుల కోసం వినూత్న కార్యక్రమం