Cold Fogging Method For Mosquitoes : మామూలు రోజుల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి చెప్పలేం. దీంతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాలు వస్తాయి. అందుకే చాలా మంది దోమల బారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్డుపై కాలువల్లో దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా మురుగు నీటిపై దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో నీటి తుంపర్లతో దోమలను తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.
నీటి తుంపర్లతో దోమలను అంతం : నీటిలో కొద్దిపాటి రసాయనాన్ని కలిపి అతి సూక్ష్మ బిందువులను గాల్లోకి విరజిమ్మే పద్ధతిలో ఈ విధానం పని చేస్తుంది. దీంతో తుంపర్లు గాలిలో పొరలా ఏర్పడటంతో అందులో చిక్కుకున్న దోమలు చనిపోతాయని జీహెచ్ఎంసీ తెలిపింది. శంషాబాద్‌లో 400 ఎకరాల్లో విస్తరించిన కన్హా శాంతి వనంలోనూ కోల్ట్ ఫాగింగ్నే ఉపయోగిస్తున్నారని బల్దియా దోమల నియంత్రణ విభాగం చెబుతుంది. ఇప్పుడు ఆ ప్రక్రియను కూకట్పల్లి జోన్లో అమలుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. కోల్డ్ ఫాగింగ్ విధానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గతేడాది ప్రశాసన్‌నగర్‌లో పరీక్షించారు. దీంతో అక్కడ దోమల విజృంభణ తక్కువయినట్లు అప్పటి కమిషనర్ ప్రకటించారు.
రెండో విడత కోల్డ్ ఫాగింగ్ : రెండో విడత కూకట్పల్లి జోన్‌లోని అల్విన్‌కాలనీలో పరీక్షించేందుకు ఈ నెల 15న బల్దియా ముహూర్థాని నిర్ణయించింది. కోల్డ్ ఫాగింగ్ ముందు, తర్వాతి పరిస్థితులు కోల్డ్ ఫాగింగ్‌తో దోమలు చనిపోతున్నాయా? ఎన్ని దోమలు చనిపోతున్నాయనే వివరాలు తెలుసుకుంటామని ఓ ఉన్నతాధికారి ఈనాడుకు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న హాట్ ఫాగింగ్‌తో దోమలు కొంత సమయం సొమ్మసిల్లి పడిపోయాయి. మైకం వదలగానే మళ్లీ విజృంభిస్తాయి.
ఎలా పనిచేస్తుందంటే : నీటి పరిమాణంలో రెండు శాతం డెల్టామెత్రిన్ రసాయనాన్ని కలుపుతారు. ఫిల్మ్ ఫామింగ్ అక్వియన్ స్ప్రే టెక్నాలజీతో పనిచేసే యంత్రాల్లోల ఈ మిశ్రమాన్ని వేసి గాల్లోకి పిచికారి చేస్తారు. దీంతో అతిసూక్ష్మ నీటి బిందువులు పొరలా ఏర్పడి దోమలను అంతం చేస్తాయని తెలిపారు.
సాయంత్రం కాగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటి కూడా రావు!
సాయంత్రం కాగానే దోమలు గృహప్రవేశం చేస్తున్నాయా? - అయితే ఇలా అడ్డుకోండి