CM Revanth Reddy Review On Tourism Development : రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యాటక శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని తెలిపారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలని సీఎం సూచించారు.
భువనగిరి కోట రోప్‌వే పనులపై ఆరా : ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, ఆ దిశగా దృష్టిసారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్ధం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు ఇలా ప్రతీ పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపరచడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. భువనగిరి కోట రోప్‌వే పనులపై ఆరా తీశారు. భూ సేకరణ పూరయిందని త్వరలో టెండర్లు పిలుస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భువనగిరి కోట రోప్‌వే పనులకు త్వరగా టెండర్లు పిలవడంతో పాటు అక్కడి చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
భవిష్యత్తుకు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలి : అటవీ, ఐటీ, విద్యుత్, టీజీఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకొని పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక శాఖ విధానాలు మరో శాఖ పాలసీలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాహస క్రీడలకు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా పర్యాటకుల్లా వచ్చిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు ఎన్నో ఉన్నప్పటికీ, గతంలో ప్రచారంపై శ్రద్ధ చూపకపోవడం, వినూత్నంగా ఆలోచించకపోవడంతో ఆశించిన ప్రగతి కనిపించ లేదన్నారు. తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
కేవలం రూ.380కే హైదరాబాద్ సిటీ టూర్ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!
ట్యాంక్‌బండ్ చుట్టూ స్కైవాక్ - భలేగా ఉంటుంది కదూ!
రెండేళ్లలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం - సీఎం ఆదేశం