Special Story On Valentines Day : ప్రేమ రెండక్షరాల కలయిక అనుకుంటే పొరపడ్డట్టే. అందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో పెన వేసుకుంటుంది. బంధాన్ని బలోపేతం చేసి అనుబంధాన్ని పెంచుతుంది. దాని స్ఫూర్తిగా ప్రేమికులు తమ ప్రయాణాన్ని పదిలం చేసుకోవాలి. చిరకాలం అన్యోన్యతకు చిరునామాగా మారాలి. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కాలి. ఆదర్శ బంధాన్ని కలకాలం కొనసాగించాలి. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మీనేపల్లి కలాన్, కడిచర్ల గ్రామాలకు చెందిన మహేందర్, గీతలవి వేర్వేరు కులాలు. డిగ్రీ చదువుతున్నప్పుడు మనసులు కలిశాయి. 2011లో పెళ్లి చేసుకున్నారు. గీత ప్రగతిశీల మహిళా సంఘం (పీడబ్ల్యూవో) రాష్ట్ర కార్యదర్శిగా, మహేందర్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పెళ్లయ్యాక అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని : శిక్షణలో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి, పెళ్లితో ఒక్కటయ్యారు యువ ఎస్‌ఐ దంపతులు శాంతి, రమేష్. జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఐలుగా పని చేస్తున్నారు. వారే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంనకు చెందిన బి.రమేష్, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోక ఫసల్వాద్‌కు చెందిన పి.శాంతి. 2020లో గ్రూప్-2లో ఆబ్కారీ శాఖలో ఎస్‌ఐ కొలువులు సాధించారు. శిక్షణ సమయంలో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి ఒక్కటయ్యారు.
లక్ష్య సాధనకు ప్రోత్సాహం : మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లత దివ్యాంగురాలు. తల్లిదండ్రులు వంగల లక్ష్మి, కమలయ్య. తండ్రి సాయంతో ట్రై సైకిల్‌పై ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంటర్ పూర్తిచేశారు. 2008లో అమ్మానాన్నలు మృతి చెందడంతో అనాథగా మారింది. 2014లో సామాజిక మాధ్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన మురళి పరిచయం కాగా ఆమెలో ధైర్యాన్ని నూరిపోశారు. అది ప్రేమగా మారింది. లతకు పాఠాల బోధన ఇష్టం కాగా, మురళి ఆ దిశగా ప్రోత్సహించారు. 2014 ఏప్రిల్ 18న వివాహం చేసుకోగా వీరికి కుమార్తె ఆకృతి ఉంది. మురళి ప్రస్తుతం సొంతంగా వెల్డింగ్ దుకాణం నడిపిస్తుండగా, అతడి సహకారంతో లత ఉచితంగా ట్యూషన్లు చెబుతుండటం విశేషం. వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.
కులాలు వేరైనా : సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన నాగరాజు, రేణుకలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో కులాలు వేరు కావడంతో వారి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. నాగరాజు, రేణుకలు సహకారం అందించుకుంటూ ముందుకు సాగారు. పెళ్లయిన ఐదేళ్లకు వారి అమ్మానాన్నలు సమ్మతించారు. ప్రస్తుతం నాగరాజు సామాజికవేత్తగా, రేణుక ఫులే గురుకులంలో తాత్కలిక ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
హాయ్ బేబీ అంటున్నారా?- ఆ పిలుపు ముంచే వలపు- హనీ ట్రాప్‌లో చిక్కారో ఇక అంతే!
వాలెంటైన్స్ డే స్పెషల్ : మీ జీవిత భాగస్వామికి ఇలాంటి ఆర్థిక బహుమతి ఇవ్వండి
వాలెంటైన్స్ డేకి ఈ 6 పనులు అసలు చేయకూడదట! అవేంటో మీకు తెలుసా?