Magha Puranam 18th Chapter : గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "జహ్నువూ! తమ పుత్రుడు అల్పాయుష్కుడని తెలిసి ఆ విప్రదంపతులు దుఃఖించసాగారు. పుత్రశోకం తల్లిదండ్రులకు ఇద్దరికీ సమానమైనా తల్లికి దుఃఖం ఒకింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ విప్రుడు తన దుఃఖాన్ని దిగమింగి తన భార్యకు తత్వబోధ ఈ విధంగా చేయసాగాడు.
మాఘ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం
విప్రుని తత్వబోధ
పుత్రుడు మరణిస్తాడేమోనని దుఃఖిస్తున్న భార్యతో విప్రుడు "ఓ కాంతా! నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎంతటి గొప్పవాడికైనా మృత్యువు రాకుండా ఉండునా? ఈ సృష్టిలో పుట్టిన ప్రతిజీవి గిట్టక మానదు. అశాశ్వతమైన ఈ శరీరమే నిజమని బ్రాంతి చెందుతున్నావు. ఏదో ఒకరోజు నువ్వు కూడా మరణిస్తావు. పుట్టడం, చావడం మళ్లీ పుట్టడం అనేవి కాలానుక్రమంగా జరిగేవి. దీనిని ఎవరు ఆపలేరు.
ఆత్మ ఒక్కటే శాశ్వతం
బాల్యం యవ్వనం వార్ధ్యక్యం ఇలా అన్ని దశలలో సుఖించి నశించే ఈ శరీరంపై బ్రాంతి విడిచిపెట్టు. శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. జీవి తాను చేసే పాపకర్మలను అనుభవించడానికి ఒక సాధనం కావాలి కాబట్టి ఈ శరీరాన్ని ఆశ్రయిస్తాడు. అంతేకాని ఈ శరీరమే నేనే అన్న భ్రమ తప్పు. ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తాల్సిఉంటుంది. నీ కుమారునికి పన్నెండేళ్ళు మాత్రమే ఆయువు ఉందని దుఃఖిస్తున్నావు. అతడు గత జన్మలో ఎవరో నీకు తెలియదు. మరణించాక ఏమవుతాడో నీకు తెలీదు. ఆత్మజ్ఞానం వృద్ధి చేసుకో! కేవలం సుఖదుఃఖాలు అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడే ఈ దేహంపై బ్రాంతి వదులుకో!
జనన మరణ చక్రభ్రమణం
పండితులు సంసారం నిత్యం కాదని గ్రహించి వివాహం చేసుకొని కూడా వైరాగ్యంతో సన్యసిస్తారు. గృహస్థ విధులు పూర్తి చేసి సంతానప్రాప్తిని పొంది చివరకు సన్యాసం స్వీకరిస్తారు. ఇందంతా పెద్ద మాయ! ఈ జనన మరణ చక్రం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ చక్రభ్రమణం నుంచి బయటపడి శాశ్వత సత్యమైన పరమాత్మను కనుగొనడంపై మనసు కేంద్రీకరించు.
గంగాతీరానికి పయనమైన విప్రుడు
పుత్ర మరణం చూడాల్సి వస్తుందని శోకిస్తున్నావు కదా! భయపడకు! నేను శ్రీహరిని పూజించి పుత్రమరణమును ఏదోవిధంగా తప్పించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ విప్రుడు తన భార్యకు తత్వోపదేశం చేసి గంగాతీరానికి వెళ్ళాడు.
విప్రునికి శ్రీహరి సాక్షాత్కారం
గంగాతీరానికి వెళ్లిన విప్రుడు సూర్యమండలం మధ్యవర్తియగు మాధవుని ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ కఠిన తపస్సు చేయసాగెను. విప్రుని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై విప్రునితో ఈ విధంగా పలికాడు.
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో ఇక్కడవరకు చెప్పి పద్దెనిమిదవ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! అష్టాదశోధ్యాయః సమాప్తః
ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం