Teacher Jobs for 2008 DSC Candidates : 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1382 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్‌లను 2008 డీఎస్సీ అభ్యర్థులతో ప్రభుత్వం భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు తమ అంగీకార పత్రం ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన వారి కాంట్రాక్టును ప్రతి విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేస్తామని తెలిపింది.
ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం : 2008 డీఎస్సీ బాధితులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీని చేపట్టమని గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగ నియామకాల విషయంలో జాప్యం చేస్తుండటంతో అభ్యర్థులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పాటించరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహా రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది.
డీఎస్సీ 2008 అభ్యర్థులు ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయరా? అంటూ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. కనీసం కోర్టు ఉత్తర్వులను అయినా గౌరవించాలని కమిషనర్‌కు సూచించింది. మీరు మనుషులేనని, చిన్నచిన్న తప్పులు జరుగుతుంటాయన్న న్యాయస్థానం, వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందంది. కోర్టు దిక్కరణ కింద మీకు(విద్యాశాఖ కమిషనర్) వ్యతిరేకంగా ఏదైనా వ్యాఖ్య రాస్తే ఉన్నత పదవుల్లో ఉన్న మీ భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుందని వ్యాఖ్యానించింది.
అసలేం జరిగింది : 30 వేల ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టుల భర్తీకి 2008 డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యాక డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించడంతో వివాదం మొదలైంది. 2008లో నోటిఫికేషన్లో డీఎడ్ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలిన 2367 పోస్టులను అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్‌లో వలె కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు ఆసక్తి చూపారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నియామకాలకు కొంత గడువు కావాలంటూ హైకోర్టును ప్రభుత్వం గడువు కోరింది. ఎన్నికల కోడ్ కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డంకి కాదని వాటిని అమలు చేయాల్సిందేనంటూ గత వారం న్యాయస్థానం తేల్చి చెప్పడంతో విచారణకు హాజరైన విద్యాశాఖ కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
డీఎస్సీ అభ్యర్ధులకు వారంలో పోస్టింగులు - న్యాయపోరాటానికి ఫలితం దక్కింది
2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - మూడు రోజుల్లో నియమాక ప్రక్రియ పూర్తి!