Online Will Writing Process : ఆస్తి వీలునామా అనేది అత్యంత కీలకమైన లీగల్ డాక్యుమెంట్. ముఖ్యమైంది అని తెలిసి కూడా, చాలామంది వీలునామా రాయడాన్ని బాగా ఆలస్యం చేస్తుంటారు. దానిపై వివిధ రకాల సందేహాలతో సతమతం అవుతుంటారు. ఆస్తిపాస్తులు కలిగిన వారు తాము చనిపోయిన తర్వాత అవి ఎవరెవరికి, ఎంతెంత మేర దక్కాలో ముందస్తుగా నిర్ణయించే వెసులుబాటును వీలునామా కల్పిస్తుంది. ప్రియమైన వారి భవిష్యత్ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుంది. న్యాయవాది సమక్షంలో వీలునామా రాయించడం పాత పద్ధతి. ఇందుకు సమయంతో పాటు డబ్బును వెచ్చించాలి. ఇప్పుడు పలు ఆన్‌లైన్ వేదికల్లో వీలునామాను సులభంగా, అతి తక్కువ ఖర్చుతో రాయొచ్చు.
ఆన్‌లైన్ వీలునామాను ఎవరు ఎంచుకోవాలి?
ఆన్‌లైన్‌లో వీలునామాను రాయడం అనేది వివిధ వ్యక్తుల ప్రాధాన్యాలు, వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి ఆన్‌లైన్‌లో వీలునామా రాసే ప్రక్రియ సులభతరమైంది. ఈ ప్రక్రియలో ఖర్చు కొంత తక్కువగా ఉంటుంది. దీనివల్ల న్యాయవాదిని సంప్రదించకుండా ఇంటి నుంచే వీలునామాను రాసే ప్రక్రియను పూర్తి చేయొచ్చు. భారత్‌లో ముస్లింలు మినహా అన్ని వర్గాల వారికి ఆన్‌లైన్ వీలునామాలు అందుబాటులో ఉన్నాయి. ముస్లింలు షరియా చట్టం ప్రకారం వీలునామా రాస్తుంటారు. అందుకు అనుగుణంగా వివిధ వ్యక్తుల అవసరాలను తీర్చేలా ముస్లింలు వీలునామాలను రాయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ వీలునామాలకు ఛార్జీ ఎంత ?
ఆన్‌లైన్‌లో వీలునామా రాసే సేవలను అందించే విభిన్న వేదికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీలునామాలో ప్రస్తావించే అంశాల సంక్లిష్టత, నిబంధనలు, షరతుల ఆధారంగా ఆయా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఏ రకం వీలునామాకైనా ఒకే రకంగా స్థిరమైన ఛార్జీలను తీసుకుంటాయి. మరికొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఆస్తిపాస్తుల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్ వీలునామాలకు ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ సర్వీసు కోసం సగటున రూ.2వేల నుంచి రూ.10వేల వరకు ఛార్జీ ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. ఆన్‌లైన్ వీలునామా కోసం 'విల్ జిని' (WillJini) సగటున రూ.5,500, 'వకీల్ సెర్చ్'(Vakilsearch) సగటున రూ.4,499 తీసుకుంటున్నాయి. వీటికి కొన్ని అదనపు ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ వంటివి కలిసే అవకాశం ఉంటుంది.
వీలునామా ఎప్పుడు రాయాలి?
పెళ్లి జరిగినప్పుడు, పిల్లలు కలిగినప్పుడు, ఆస్తిపాస్తులు కొన్నప్పుడు, వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, స్థిర చరాస్తుల పంపకాల కోసం వీలునామాలను మనం రాయొచ్చు. ఇలాంటి వ్యవహారాల్లో వీలునామా రాయడం చాలా కీలకం. ఇప్పటికే రాసిన వీలునామాలో, భవిష్యత్ అవసరాలు/ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయొచ్చు. మీరు లేకపోయినా, మీ కోరిక ప్రకారం ఆస్తుల పంపకాలు జరగాలంటే వీలునామా రాయడం తప్పనిసరి.
సంతకం చేస్తేనే చెల్లుబాటు
ఆన్‌లైన్‌లో వీలునామాను రాసినంత మాత్రాన పని పూర్తి కాదు. వీలునామా రాసిన వ్యక్తి, దానిపై స్వయంగా సంతకం చేయాలని భారత వారసత్వ చట్టం-1925 చెబుతోంది. ఆన్‌లైన్‌లో వీలునామా రాసే ప్రక్రియను ఫైనలైజ్ చేశాక, దాన్ని ప్రింట్ తీసుకుని సంతకం చేయాలి. ఇద్దరు సాక్షుల సమక్షంలో సంతకం చేసిన వీలునామానే చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది.
వీలునామాను అప్‌డేట్ చేసుకోండి
ఆన్‌లైన్‌లో వీలునామాను రాసిన తర్వాత, కనీసం మూడు నుంచి ఐదేళ్లకోసారి దాన్ని సంబంధిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో సమీక్షించుకోవాలి. అవసరాలకు అనుగుణంగా దానిలోని అంశాలను అప్‌డేట్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ వీలునామా లాభాలు
సరళత, సౌలభ్యం : ఆన్‌లైన్‌లో వీలునామా రాసేవారు ఆస్తిపాస్తులు, పంపకాలు, వారసులు, తేదీలు, వయసులు వంటి సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది. ఈ వివరాల ఆధారంగా చట్టప్రకారం చెల్లుబాటు అయ్యే ఆన్‌లైన్ వీలునామా రెడీ అయిపోతుంది. చట్టంపై అవగాహన లేనివారు కూడా ఈజీగా ఆన్‌లైన్‌లో వీలునామా రాయించుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
తక్కువ ఛార్జీ : న్యాయవాదులతో వీలునామా రాయించుకుంటే ఎక్కువగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. కొందరు న్యాయవాదులు గంట లెక్కన ఛార్జీని వసూలు చేస్తారు. కొందరు లాయర్లు వీలునామా రాసేందుకు ఫిక్స్‌డ్ ఛార్జీలను తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో వీలునామా రాయడానికి అంతగా ఛార్జీలు ఉండవు.
వేగంగా అందుబాటులోకి : నిర్దిష్ట గడువులోగా వీలునామాను రాయాలని భావిస్తే తప్పకుండా ఆన్‌లైన్ వీలునామా సర్వీసులను వాడుకోవచ్చు. ఇవి వేగవంతంగా ఉంటాయి. మన సమయం కూడా ఆదా అవుతుంది. ఆస్తుల సమాచారం, వారసుల సమాచారం సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో వీలునామాను సిద్ధం చేశాక, మీరు సంతకం చేయగానే అది చట్టప్రకారం చెల్లుబాటులోకి వచ్చేస్తుంది.
జవాబుదారీతనం, సమగ్రత : ఆన్‌లైన్‌లో వీలునామాలు రాసే వేదికలు థర్డ్ పార్టీ సంస్థలుగా వ్యవహరిస్తాయి. వీలునామా రాసే వ్యక్తి అందించే సమాచారం ఆధారంగానే అవి వీలునామాను రెడీ చేసి, అందిస్తాయి. వీలునామాలో లోపాలు లేకుండా జాగ్రత్తపడతాయి. మోసాలకు, అనైతిక పద్ధతులకు తావు ఇవ్వవు.
ఆన్‌లైన్ వీలునామా నష్టాలు
- పరిమిత మానవ పర్యవేక్షణ : కొన్ని ఆన్‌లైన్ వీలునామా సర్వీసులు ఆటోమేటెడ్ ప్రక్రియలపై ఆధారపడతాయి. వీటివల్ల న్యాయవాదులతో నేరుగా చర్చించే అవసరం తప్పుతుంది. క్లయింట్ అందించే సమాచారాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు.
- పరిమిత సౌలభ్యం : ఆన్‌లైన్‌లో వీలునామా రాసేందుకు కొన్ని ప్రామాణిక టెంప్లేట్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల వీలునామా రాసే వ్యక్తికి చెందిన ప్రత్యేకమైన, సంక్లిష్టమైన కోరికలను వీలునామాలో చేర్చే అవకాశం ఉండదు.
- లోపాలకు అవకాశం: న్యాయవాది సమీక్ష లేకుండానే ఆన్‌లైన్ వీలునామా తయారవుతుంది. అందువల్ల దానిలో కొన్ని చట్టపరమైన లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
- అందరికీ అనుకూలం కాదు : భారీ ఆస్తులు ఉన్నవారికి, ముస్లింలకు, సంక్లిష్టమైన షరతులు/కోరికలు కలిగిన వారికి ఆన్‌లైన్ వీలునామాలు అంత అనుకూలం కావు. ఇలాంటి వారు నేరుగా న్యాయవాదులతో వీలునామా రాయించుకోవడమే ఉత్తమం.
- సాధారణ పరిస్థితులకు అనుకూలం : సరళమైన కుటుంబ పరిస్థితులు, సరళమైన వారసత్వ ప్రణాళికలు, సరళమైన సంపద పంపిణీ లక్ష్యాలు కలిగిన వారికి ఆన్‌లైన్ వీలునామాలు ఉపయోగపడతాయి. సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కోరికలు/షరతులు కలిగిన వారికి ఇవి అంతగా ఉపయోగపడకపోవచ్చు.
ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్ వీలునామాలు
ఆన్‌లైన్ వీలునామాల తయారీ ఖర్చు తక్కువ. వీటి రూపకల్పన వేగవంతంగా జరిగిపోతుంది. సాధారణ పరిస్థితుల్లో వీటిని వాడుకోవచ్చు. ఆస్తుల పంపిణీకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు/కోరికలు/షరతులు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా న్యాయవాదులను సంప్రదించాలి. ఇలాంటి సమయాల్లో న్యాయవాది, ఇద్దరు సాక్షుల సమక్షంలో స్వయంగా వీలునామా రాయించుకోవడం ఉత్తమం.