CM Revanth Reddy Launches Vijaya Telangana Book : ప్రస్తుతం చట్టసభల్లో రాజకీయ నేతలు వాడుతున్న భాష సరిగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు నచ్చకపోయినా అదే పద్ధతి అవలంభించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అదే ఆట తానూ ఆడకుంటే ఔట్ అయ్యే పరిస్థితి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ హోం మంత్రిగా పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన 'విజయ తెలంగాణ' అనే పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆవిష్కరించారు.
తెలుగు, ఆంగ్ల భాషల్లో విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలని, తెలంగాణ ఉద్యమంలో ఒక కుటుంబమే పాల్గొన్నట్లు చరిత్రను వక్రీకరించారని తెలిపారు. ఉద్యమంలో ఎన్నోవర్గాలు పాల్గొన్నాయని సీఎం తెలిపారు.
"తెలంగాణలో ఇప్పుడు గౌరవప్రదమైన రాజకీయాలు లేవు. తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం చట్టసభల్లో రాజకీయ నేతలు వాడుతున్న భాష సరిగా లేదు. ఇప్పుడు వాడుతున్న భాష నాకు కూడా నచ్చటం లేదు. నాకు నచ్చకపోయినా అదే పద్ధతి అవలంభించాల్సిన పరిస్థితి ఉంది. అందరిలా నేనూ ఆట ఆడకపోతే ఔట్ అయ్యే పరిస్థితి ఉంది" -సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలి : రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం గౌరవప్రదమైన రాజకీయాలు లేవని, రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమంపై చర్చ లోతుగా జరగాలని, తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
దేవేందర్ గౌడ్ వల్లే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు : రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, గోదావరి జలాలను తెలంగాణలో పారించేందుకు ఉద్యమం చేపట్టారని సీఎం తెలిపారు. దేవేందర్‌గౌడ్ పాదయాత్ర వల్లే ఆనాడు ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలంతా టీజీ అని బండ్లు, బోర్డులు, గుండెల మీద రాసుకున్నారని, ప్రజలు కోరుకున్న విధంగానే ఇప్పుడు టీఎస్‌ను టీజీగా మార్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
నివురు గప్పిన నిప్పులా : ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ, పదేళ్లు నివురుగప్పిన నిప్పులా ఉందన్న రేవంత్ రెడ్డి జయజయహే తెలంగాణను ఇప్పుడు రాష్ట్ర గీతంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో కొందరు ఆర్థికంగా మెరుగైన స్థితిలో లేరని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ కొండా లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రముఖులు హాజరయ్యారు.
కులగణన సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్‌లకు సామాజిక బహిష్కరణే శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి
డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదిక కావాలి : రేవంత్ రెడ్డి