50 Crore Devotees Holy Dip : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న మహాకుంభ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
"ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 50 కోట్ల మందికిపైగా మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. భారత్, చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే" అని యూపీ సర్కారు తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానంలో శుక్రవారం (ఫిబ్రవరి 14న) ఒక్కరోజే 92 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని పేర్కొంది.
జనాభాపరంగా టాప్-10 దేశాల కంటే!
"జనాభాపరంగా ప్రపంచంలోని టాప్-10 దేశాల్లో భారత్ (141 కోట్లు), చైనా(140 కోట్లు), అమెరికా (34 కోట్లు), ఇండోనేషియా (28 కోట్లు), పాకిస్థాన్ (25 కోట్లు), నైజీరియా (24 కోట్లు), బ్రెజిల్ (22 కోట్లు), బంగ్లాదేశ్ (17 కోట్లు), రష్యా (14 కోట్లు), మెక్సికో (13 కోట్లు) ఉన్నాయి" అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తుచేసింది. ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళా కొనసాగనుంది. అప్పటివరకు మరిన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఇందుకోసం యూపీ సర్కారు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జనవరి 29న త్రివేణీ సంగమంలో తొక్కిసలాట ఘటన జరగగా, పలువురు భక్తులు చనిపోయారు. అయినా పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.
సతీసమేతంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పుణ్యస్నానాలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తన సతీమణి అమృతా ఫడణవీస్, కుమార్తె దివిజలతో కలిసి శుక్రవారం రోజు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభ మేళాలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ఇందుకుగానూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
#WATCH | UP | Maharashtra CM Devendra Fadnavis along with his wife Amruta and daughter Divija takes a holy dip at Triveni Sangam during Mahakumbh in Prayagraj pic.twitter.com/EC91VcxGPp
— ANI (@ANI) February 14, 2025
"మహాకుంభ మేళాకు వస్తున్న ప్రతీ భక్తుడు సంతోషంగా ఉన్నాడు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఈసారి మేళా సరికొత్త రికార్డును సృష్టించింది" అని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. "మహాకుంభ మేళాలో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు మేం సీఎం యోగికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తదుపరి కుంభమేళా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుంది. దాన్ని కూడా ఇదేవిధంగా విజయవంతం చేయడంపై మేం ఫోకస్ పెడతాం" అని దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడణవీస్ చెప్పారు.