Greatest All-Rounders Of Cricket : ఏ క్రికెట్ జట్టుకైనా నికార్సైన ఆల్ రౌండర్‌లే ప్రధాన బలం. టీమ్ అవసరాల మేరకు అటు బంతి, ఇటు బ్యాటుతో రాణించగలరు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఏ ఫార్మాట్ అయినా ఆల్‌రౌండర్‌లు చాలా కీలకం. కొందరు బ్యాటర్‌గా మొదలై బౌలింగ్ స్కిల్స్ మెరుగుపరచుకుంటారు. ఇంకొందరు బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్ అందిపుచ్చుకుంటారు. అయితే చరిత్రలో రెండు విభాగాల్లో సమానంగా రాణించిన క్రికెటర్లు అరుదుగా ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుగురు ఆల్ రౌండర్లు మాత్రమే 6000కు పైగా పరుగులు చేసి 600 వికెట్లకు పైగా తీయగలిగారు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు ఇద్దరు ఉండటం విశేషం.
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 14,730 పరుగులు చేశాడు. బంగ్లా తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. అలానే 712 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షకీబ్ తన కెరీర్‌లో 14 సెంచరీలు చేయగా, 25 సార్లు ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేశాడు.
కపిల్ దేవ్ (భారత్)
నేటికీ భారత టాప్ ఆల్‌రౌండర్‌ల ప్రస్తావన వస్తే కపిల్ దేవ్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. 1983లో టీమ్‌ఇండియాకి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. కపిల్ తన కెరీర్‌లో 9,031 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి బౌలర్‌గా 687 వికెట్లు తీశాడు. 25 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా)
షాన్ పొలాక్ దక్షిణాఫ్రికా అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పొలాక్ మొత్తంగా 829 వికెట్లు తీశాడు. ఇందులో 21 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. పొలాక్ బౌలింగ్‌తో పాటు నమ్మకమైన లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్. అతడి కెరీర్‌లో 7,386 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.
డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్)
డేనియల్ వెట్టోరి న్యూజిలాండ్ గొప్ప స్పిన్నర్లలో ఒకడు. కెరీర్‌లో 705 వికెట్‌లు తీశాడు. 22 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్. స్పెషలిస్ట్ బౌలర్‌గా అయినా సరే కెరీర్‌లో 6,989 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి.
రవీంద్ర జడేజా (భారత్)
జడేజా టీమ్‌ఇండియా టాప్ ఆల్‌రౌండర్‌లలో ఒకడు. అతడు 17 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఏకంగా 603 వికెట్లు పడగొట్టాడు. 4 సెంచరీలతో సహా 6,664 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్నాడు.
వసీం అక్రమ్ (పాకిస్థాన్)
పాకిస్థాన్ తరఫుర వసీం అక్రమ్ బంతి, బ్యాటుతో రాణించాడు. కెరీర్‌లో 916 వికెట్లు పడగొట్టాడు. 31 సార్లు ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్‌గా నిలిచాడు. 3 సెంచరీలతో 6,615 పరుగులు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సెట్! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే
అయ్యో వికెట్ కీపర్ ఎంత పని చేశావయ్యా! - ఒక్క మిస్టేక్‌తో కప్ దూరమైందిగా!