Son Keeps Father Dead Body Outside : డబ్బు, ఆస్తులకే విలువనిస్తూ కొందరు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. ఆస్తి పంచాయితీతో పెంచి పెద్ద చేసిన తండ్రికి అంత్యక్రియలు చేయకుండా 4 రోజుల పాటు శవాన్ని ఇంటి ముందే ఉంచేసిన అమానవీయ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం : కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు వెలికట్టె యాదగిరి (60)కి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య రేణుకకు రమేశ్, రెండో భార్య పద్మకు ఉపేందర్, శోభలు సంతానం. వృద్ధుడు యాదగిరి పేరిట 15 ఎకరాల భూమి ఉంది. దీనిని ఐదెకరాల చొప్పున తన ఇద్దరు కుమారులైన రమేశ్, ఉపేందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, మిగిలిన 5 ఎకరాల్లో కుమార్తె శోభకు 3 ఎకరాలు ఇచ్చి వివాహం చేశారు.
కుమారులకు పంచగా మిగిలిన 2 ఎకరాలను రెండో భార్య పద్మ పేరిట పట్టా చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరి గత సోమవారం (10 ఫిబ్రవరి) ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని రెండో భార్య పద్మ, కుమార్తె శోభ కలిసి ఏడునూతులలోని మొదటి భార్య కుమారుడైన రమేశ్ ఇంటికి తీసుకువచ్చారు.
"నా భర్త చనిపోయినప్పటి నుంచి ఆస్తి మొత్తం తన పేరున రాయమని నా కుమారుడు వేధిస్తున్నారు. నా భర్త పెద్ద భార్య కుమారుడు, కోడలు కలిసి 4 రోజులుగా అంత్యక్రియలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఉన్న 2 ఎకరాల భూమి ఆయన పేరున రాస్తే నా బతుకేం కావాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని నన్ను బలవంతంగా ఎమ్మార్వో ఆఫీస్‌కు తీసుకొచ్చారు. నాకు భూమి ఇవ్వడం ఇష్టం లేదు" - పద్మ, మృతుని భార్య
పోలీసు, రెవెన్యూ అధికారుల చొరవతో అంత్యక్రియలు : ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని తండ్రికి దహన సంస్కారాలను నిర్వహించాలంటే చిన్నమ్మ పద్మ పేరిట ఉన్న 2 ఎకరాల భూమిని తన పేరిట చేయాలంటూ రమేశ్ పంచాయితీ పెట్టారు. పంచాయితీ తేలకపోవడంతో నాలుగు రోజులుగా శవం కుమారుడి ఇంటి ముందే ఉంది. చివరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులతో పలు దఫాలుగా మాట్లాడి పద్మ పేరిట ఉన్న 2 ఎకరాల భూమిలో ఎకరం 10 గుంటల భూమిని రమేశ్‌కు రాత్రి 8 గంటలకు ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
తల్లి మరణం, చేరదీసిన నానమ్మను చంపి జైలుకెళ్లిన తండ్రి - అనాథలైన ఇద్దరు చిన్నారులు