Parents Should be Careful With Jellies For Kids : ఆహార పదార్థాల తయారీ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తే మార్కెట్లోకి వచ్చే ఉత్పత్తులు హానికరంగా మారతాయి. పలు సంస్థలు తయారు చేసిన కొన్ని నమూనాలను ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు పరీక్షించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు తినే మామిడిపండు జెల్లీలో పది రెట్లు అధికంగా సల్ఫైట్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఏం కలిపారో తెలియని వంట నూనె మార్కెట్లో చలామణి అవుతుంది. రంగులతో తయారయ్యే టీ పొడి, బెల్లం, బిర్యానీ, ఇతర మాంసాహారాలు, మిఠాయిలు, ఇతరత్రా ఆహార పదార్థాల్లోనూ మోతాదుకు మించి రసాయనాలు, రంగులు ఉన్నట్టు తేలింది.
దీపు మ్యాంగో జెల్లీ పేరుతో ఉన్న ప్యాకెట్‌లోని పదార్థాన్ని నాచారంలోని రాష్ట్ర ఆహార నమూనాల పరీక్ష కేంద్రానికి పంపగా, అందులో 100 పీపీఎంగా ఉండాల్సిన సల్ఫైట్ 1,146 పీపీఎం ఉన్నట్లు తేలింది. అలాంటి జెల్లీని తింటే ఎలాంటి ప్రభావం ఉంటుందని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్‌ను అడగ్గా పిల్లలు, పెద్దల్లో వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశముందన్నారు. అలాగే తింటూ ఉంటే కొంత కాలానికి నరాల సమస్య, క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తెలిపారు. సాధారణంగా సల్ఫర్‌ను, కొన్ని రకాల ఆహార రంగులను వంటల్లో ఉపయోగించవచ్చని అన్నారు. 'వాటి శాతం మోతాదులోపే ఉంటే ఆరోగ్యానికి ఏమీ కాదు. తయారైన వస్తువులను మార్కెట్‌కు పంపించే ముందు పరీక్షలు జరపాలన్న నిబంధనలు అమలు చేస్తే నాసిరకం, అనారోగ్యకర పదార్థాలను బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు’ అని డాక్టర్ లక్ష్మణ్ వివరించారు.
- ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ కిమియా డేట్స్ ప్యాకెట్‌లోని కర్జూరాను పరిశీలించగా, అందులో ఏ ఒక్కటీ తినేందుకు పనికిరాని స్థితిలో ఉన్నట్టు అధికారులు, పైపొర కింద బూజు ఉన్నట్టు నిపుణులు తేల్చారు.
- బెల్లంలో సల్ఫైట్, టెట్రాజైన్‌తో పాటు సన్‌సెట్ ఎల్లో రంగులు కలిపినట్లు గుర్తించారు.
- శ్రీసూర్య కాష్యూ పేరు గల ప్యాకెట్‌లోని జీడిపప్పులో పురుగులు, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ నేషనల్ జింజర్ అండ్ గార్లిక్ పేస్టులో తక్కువ ఆమ్లం ఉంది.
- హెల్త్‌కేర్ రిఫైన్డ్ వంట నూనె డబ్బాపై ఉన్న సమాచారానికి తగ్గట్టు అందులోని ప్రమాణాలు సరిపోలకపోవడం, తప్పుడు సమాచారంతో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు నాచారం ప్రయోగశాలలో గుర్తించారు. పైవన్నీ తినేందుకు పనికిరావని తేల్చారు.
అనారోగ్యకరమైనవిగా తేలితే శిక్షలు : తిను పదార్థాలు పరీక్షల్లో అనారోగ్యకరమైనవిగా తేలితే తయారు చేసిన వారిపై ఆహార భద్రత చట్టం ప్రకారం మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, పదార్థాల నాణ్యతలో లోపాలను బట్టి జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయని జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం చెబుతోంది. గత కొన్ని రోజులుగా నమూనాల సేకరణను పెంచామని అధికారులు తెలిపారు
"ఇంట్లో వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా? - మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి"
ఆహార పదార్థాలు వేయగానే నూనె పొంగుతోందా? - అయితే అది కచ్చితంగా కల్తీదే
బిగ్ అలర్ట్ : రోడ్ సైడ్ టిఫిన్ చేస్తున్నారా? - క్యాన్సర్ ముప్పు తప్పదట!