Side Effects of Eating Panipuri : సాయంత్రమైతే చాలు చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఠక్కుగా గుర్తుకొచ్చేది పానీపూరి. ముఖ్యంగా యువతుల్లో అయితే దీనికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు రోడ్డు పక్కన, గల్లీలోనూ, వీధుల్లోనూ పానీపూరికి విపరీతమైన గిరాకీ ఉంటోంది. ఇప్పుడు ఈ గప్‌చుప్‌లు పట్టణాలకే కాకుండా పల్లెల్లోనూ వ్యాపించింది. అయితే ఈ పానీపూరీలు అపరిశుభ్రత వాతావరణంలో, చేతుల శుభ్రత పాటించని వారి వద్ద తింటే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లేనట. ఇలాంటి చోట్ల తినకపోవడమే మేలని సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రికి చెందిన ఆహార నిపుణులు ఎస్. బాల స్వామి. తగిన జాగ్రత్తలు పాటిస్తే మాత్రం కొంతమేరకు ఇబ్బందులు తప్పినట్లేనని చెబుతున్నారు.
జాగ్రత్తలు :
- పరిసరాల పరిశుభ్రత పాటించే వారి వద్దే పానీపూరీ తినాలి.
- చేతులకు గ్లౌజ్‌లు, శుచిశుభ్రత పాటించే వారిని ఎంచుకోవాలి.
- ముఖ్యంగా పిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి తినిపించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- పానీపూరిలోకి వాడుతున్న నీరు స్వచ్ఛమైనదేనా అని గుర్తించాలి. దీని గురించి ఏమాత్రం అనుమానం వచ్చినా అక్కడ తినకపోవడమే శ్రేయస్కరం.
అపరిశుభ్రతే ప్రధాన కారణం : పట్టణాలు, పల్లెల్లో పానీపూరి బండ్లు ప్రతి వీధిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా రద్దీ ప్రాంతాల్లో వీటిని పెడుతుంటారు. కానీ ఇలాంటి ప్రాంతాల్లో చాలా బండ్ల వద్ద పరిశుభ్రత అనేది అసలు ఎక్కడా కనిపించదు. ఓ వైపు మురుగు కాలువలు, మరోవైపు దుర్గంధం, ఇంకోవైపు వాహనాల నుంచి వచ్చే పొగ ఇలా అన్నింటి మధ్య పానీపూరీ తినడం ఆరోగ్యానికి ప్రమాదమే. పూరీలపై దుమ్ము, ధూళివాలడంతో పాటు ఇందులో ఉపయోగించే నీరు కలుషితం అవుతుంది. దీంతో మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు వేసవి కావడంతో వీటికి డిమాండ్ భారీగానే పెరుగుతోంది.
పానీపూరి ఇలా పెడుతున్నారా జాగ్రత్త : చేతులు శుభ్రం చేసుకోకుండానే, గ్లౌజులు ధరించకుండానే పానీపూరీలను నీటిలో ముంచి పెడుతుంటారు. కొంతమంది అయితే పానీపూరీలను నీటిలో ముంచేటప్పుడు చేతి వేళ్ల గోర్లు కూడా తీసుకోరు. దీంతో తొందరగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
ఉప్పు మహా ముప్పు :
- పానీపూరీలో రుచి కోసం ముఖ్యంగా ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు.
- అలాగే తెల్లటి మైదా పిండిని వినియోగిస్తుంటారు. ఇవి బరువును ఆటోమెటిక్‌గా పెంచేస్తుంటాయి.
- సోడియం కంటెంట్ అధికంగా వినియోగిస్తే జీర్ణ వ్యవస్థ పొరను దెబ్బ తీస్తుంది.
- నీళ్లలో కలిపే పచ్చిమిర్చి ముద్ద, ఇతర పదార్థాలతో అల్సర్ వచ్చే అవకాశం ఉంది.
- ఈ పచ్చిమిర్చి ముద్దతో కడుపులో మంట వస్తుంది. పరాన్నజీవులు కడుపులో పెరగడానికి, పిల్లల్లో ఎదుగుదల మందగించడానికి కారణం అవుతుంది.
- వినియోగించే నీరు అపరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం వస్తుంది.