Tele Manas for Mental Health Care for Students : విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. అంతటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం మానసికంగా కుంగుబాటుకు గురికావడమే. పరీక్షలు రాసిన తర్వాత ఉత్తీర్ణత వస్తుందో లేదోనని ముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు తారసపడుతూనే ఉన్నాయి.
- ఇటీవల మనస్తాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
- పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తామో లేదోనన్న భయంతో గతేడాది ఇద్దరు విద్యార్థులు ఫలితాలకంటే ముందు ప్రాణాలు తీసుకున్నారు.
- ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని మరో నలుగురు ఆత్మహత్య చెందారు.
అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు టెలీమానస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్‌ఫ్రీ నంబరుకు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు మనసు టెలీమానస్‌తో మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలందిస్తోంది. మానసికంగా దృఢపరుస్తూ ఒత్తిడి నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తోంది.
అత్యంత కీలక సమయం : ఇప్పుడు పది, ఇంటర్, నీట్, జేఈఈ ఇలా అన్నిరకాల పరీక్షల సమయం. ఈ మూడు మాసాలు అత్యంత కీలకం. పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు తడబడే ప్రమాదముంటుంది. అందుకే టెలీమానస్‌ను వినియోగించి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టోల్‌ఫ్రీ నంబరుపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. అదే విధంగా కుటుంబ సభ్యులు, విద్యాలయాల్లో గురువులు ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారిని గుర్తించి టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవరసముంది. ఇటీవల ఇంటర్ విద్యార్థులు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యసతో బాధపడుతుంటే వారు టోల్‌ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
అలాంటి వారికి ఎంతో మేలు : 2022లో అందుబాటులోకి తీసుకొచ్చిన టెలీమానస్‌ను దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని సైక్రియాటిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ తెలిపారు. ఇప్పటివరకు మూడ లక్షల మందికి పైగా సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కేంద్రంలో కొంతమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ 24 గంటలు సేవలందిన్నారని వివరించారు. 14416 నంబర్‌పై విస్తృత అవగాహన కల్పించడానికి తమ వంతుగా పనిచేస్తున్నామన్నారు. ఈ నంబరుకు ఫోన్ చేసిన వారికి అవసరమైమతే జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తారని తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి ఐదు నిమిషాల కౌన్సిలింగ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
ఎవరు ఫోన్ చేయవచ్చు అంటే :
1. ఒత్తిడి
2. కుటుంబ సమస్యలు
3. ఆత్మహత్య ఆలోచనలు
4. మద్యం వ్యసనాలు
5. మతిమరుపు సమస్య
6. నిద్రలేమి
7. ఒంటరితనం
8. ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే అవసరమైన కౌన్సిలింగ్‌తో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆత్మహత్య ఆలోచనలున్న వారిని గుర్తించి వారిని టోల్‌ఫ్రీ నంబరు కౌన్సిలర్‌తో కొంత సమయం మాట్లాడిస్తే ప్రయోజనమే.
క్షణాల్లో అందుబాటులోకి : టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్(టెలీమానస్)కు దేశవ్యాప్తంగా 14416 లేదా 1800 8914416 టోల్‌ఫ్రీ నంబరు కేటాయించారు. దీనికి ఫోన్ చేస్తే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్‌ఎస్) ద్వారా భాషను ఎన్నుకున్నాక ఆ భాషలోని సుశిక్షితులైన కౌన్సిలర్‌కు కనెక్ట్ చేస్తారు. పరిస్థితిని బట్టి మానసిక ఆరోగ్య వైద్య నిపుణులకు సిఫారసు చేస్తారు. ఫోన్ చేసిన వ్యక్తికి సమీపంలో ఉన్న సైక్రియాట్రిక్ వైద్య నిపుణులున్న కేంద్రానికి చికిత్స కోసం సిఫార్సు చేస్తారు. ఒకవేళ వ్యక్తిని ప్రత్యక్షంగా ఇంటివద్దే కలవాల్సి ఉంటే ప్రాథమిక వైద్య సిబ్బందికి సందేశం పంపిస్తారు. వారి ద్వారా మానసిక ఆరోగ్య చికిత్సకు తరలిస్తారు.
'ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి- ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి'
అపార్ట్మెంట్ పైనుంచి దూకి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య - పని ఒత్తిడి భరించలేకే!
పరీక్షల టైంలో ఈ ఒక్క వస్తువును పక్కన పెట్టి చూడండి - విజయం మీదే!