Salary Hikes In 2025 : 2025 సంవత్సరంలో భారత్‌లోని వివిధ రంగాల్లో వేతనాల పెరుగుదల ఎలా ఉండొచ్చు? అనే దానిపై 'మైఖేల్ పేజ్ 2025 శాలరీ గైడ్' నివేదిక విడుదలైంది. దీని ప్రకారం కార్పొరేట్ కంపెనీల్లో వార్షికంగా సగటున 6 నుంచి 15 శాతం దాకా వేతనాలు పెరగనున్నాయి. పరిశ్రమ, ఉద్యోగి పాత్ర, నైపుణ్యాల స్థాయి ఆధారంగా వేతనాల పెంపు గరిష్ఠంగా 30 నుంచి 40 శాతం దాకా ఉంటుందని అధ్యయన నివేదిక అంచనా వేసింది. అధునాతన/సరికొత్త నైపుణ్యాలను కలిగిన వారికి, నాయకత్వ స్థానాల్లో పనిచేసే సామర్థ్యమున్న వారికి గరిష్ఠ స్థాయిలో వేతనాల పెంపు ఉంటుందని విశ్లేషించింది. పదోన్నతులు (ప్రమోషన్లు) పొందే సీనియర్ ఉద్యోగులకు 20 నుంచి 30 శాతం దాకా వేతనాల పెంపు లభిస్తుందని పేర్కొంది.
భారత్‌లోకి డజనుకుపైగా ప్రఖ్యాత ఫండ్ల రాకతో
2024 సంవత్సరం తొలినాళ్లతో పోలిస్తే గత కొన్ని నెలల్లో భారత్‌లోని ఉద్యోగ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు కనిపించాయని 'మైఖేల్ పేజ్ 2025 శాలరీ గైడ్' నివేదిక తెలిపింది. వివిధ రంగాల్లో ఉద్యోగాల భర్తీ వేగాన్ని పుంజుకుందని పేర్కొంది.
''దాదాపు డజనుకుపైగా ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేటు ఈక్విటీ, సావరిన్, వెంచర్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లు భారత్‌లోకి కార్యకలాపాలను విస్తరించాయి. భారత ఆర్థిక వ్యవస్థపై అవి ఉంచిన నమ్మకాన్ని ఈ పెట్టుబడులు ప్రతిబింబిస్తున్నాయి'' అని నివేదిక విశ్లేషించింది.
''దేశంలోని వివిధ రంగాల ఉద్యోగులకు ఈ ఏడాది వేతనాల పెంపు 6 నుంచి 15 శాతం దాకా ఉండొచ్చు. దీన్ని సగటును మనం 9 శాతంగా పరిగణించవచ్చు. గతేడాది కూడా ఇంతే స్థాయిలో వేతనాలు పెరిగాయి. ఈసారి కూడా వివిధ రంగాల వేతనాల పెంపులో భారీ వ్యత్యాసాలు ఉంటాయి. నైపుణ్య స్థాయులు, పరిశ్రమ రకాన్ని బట్టి వేతన పెంపు నిర్ణయం అవుతుంది'' అని పేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ చెప్పారు.
వేతనాల పెంపులో టాప్ ఇవే
''ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీ, తయారీ విభాగం సారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్యాంకింగ్, ఫిన్ టెక్, ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ సంస్థల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈసారి వేతనాల పెంపు ఆకర్షణీయంగా ఉండొచ్చు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోని రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, కంప్లయన్స్, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు బాగా పెరిగేే అవకాశం ఉంది. ఈ విభాగాల్లోని వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది'' అని అంకిత్ అగర్వాల్ చెప్పారు.
వేతనాలు ఎవరికి పెరుగుతాయంటే
''మార్కెట్ అవసరాలకు అనుగుణమైన సామర్థ్యాలను కలిగిన వారికి వేతనాల పెంపు బాగా జరుగుతుంది. వేతనాల పెంపును కోరుకుంటే, నైపుణ్యాలను పెంచుకోక తప్పదు'' అని ఆయన సూచించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ స్కిల్స్ కలిగిన వారికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), 5జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయని అంకిత్ అగర్వాల్.