Kadiyam Srihari Comments On By Election : గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. దిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ సంతోష పడుతున్నారన్నారు. బీఆర్ఎస్తో స్నేహం చేయడమే ఆప్ ఓటమికి కారణమని ఆయన వివరించారు. దిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.
ఉపఎన్నిక వస్తే పారిపోను నిలబడి పోరాడుతా : ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని దీనిపై వచ్చే తీర్పును శిరసావహిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. ఉప ఎన్నిక వస్తే పారిపోనని నిలబడి పోరాడతానని వివరించారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది ఆ పార్టీయేనని కడియం విమర్శించారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 18 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎవరైనా కోర్టు తీర్పునకు లోబడి ఉండాల్సిందే. నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఒకవేళ ఉపఎన్నికలంటూ వస్తే తప్పకుండా వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్. ఆ పార్టీకి ఫిరాయింపుల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదు. - కడియం శ్రీహరి,ఎమ్మెల్యే
బీఆర్ఎస్తో స్నేహమే ఆప్ ఓటమికి కారణం : దిల్లీలో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ వారి కంటే ఎక్కువగా కేటీఆర్ ఎందుకు సంతోష పడుతున్నారో అర్థం కావట్లేదని కడియం శ్రీహరి అన్నారు. దిల్లీలో ఆప్ ఓటమి పాలవ్వడానికి కారణం బీఆర్ఎస్తో స్నేహమేనని కడియం విమర్శించారు. బీఆర్ఎస్తో దోస్తానానే ఆప్ పార్టీ అధికారం కోల్పోయేలా చేసిందన్నారు. దిల్లీలో కాంగ్రెస్, ఆప్‌లు కలిసి పోటీ చేసి ఉంటే మళ్లీ తప్పకుండా మంచి ఫలితాలు వచ్చి ఆప్ అధికారంలోకి వచ్చేదన్నారు. అలా చేయకపోవడం వల్లనే బీజేపీకి కలిసి వచ్చిందని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను : కడియం శ్రీహరి - Kadiyam Srihari Election Campaign