President Rule Imposed In Manipur : మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడం వల్ల అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం.
"రాజ్యాంగ నిబంధనల ప్రకారం మణిపుర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవు అనేది నా అభిప్రాయం. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తున్నాను. ఇకపై మణిపుర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, గవర్నర్ అధికారాలు నా పరిధిలోకే వస్తాయి" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానం పెడతామంటే- రాష్ట్రపతి పాలనే విధిస్తారా ? : కాంగ్రెస్
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మణిపుర్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన తరుణంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రమోద్ తివారీ ప్రశ్నించారు.
#WATCH | Delhi | On President's Rule imposed in Manipur, Congress MP Pramod Tiwari says, " the bjp wants to kill the democracy...why was the president's rule imposed when preparations to bring about the no-confidence motion were being made?..."
— ANI (@ANI) February 13, 2025
(self made video) pic.twitter.com/nra7NJ1o9u
అక్రమ వలసలను ఆపడంలో తడబడ్డాం : బీరేన్ సింగ్
అంతకుముందు, 'ఇండీజినస్ పీపుల్'ను ఉద్దేశిస్తూ ఎన్ బీరెన్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2023 మే 3 నుంచి రాష్ట్రంలోకి అక్రమ వలసలు పెరిగాయని, వాటిని కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాగా ఇబ్బంది పడిందని ఆయన చెప్పారు. మణిపుర్ హింసాకాండను అదునుగా చూసుకొని, రాష్ట్రంలోకి అక్రమ వలసలు జరిగాయన్నారు. భారీగా జరుగుతున్న వలసల వల్ల మణిపుర్ సామాజిక అస్తిత్వానికే ముప్పు పొంచి ఉందని బీరెన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
"మా భూమికి, మా ఉనికికి ముప్పు పొంచి ఉంది. మా జనాభా తక్కువ. వనరులు తక్కువ. మేం బలహీనంగా ఉన్నాం. మణిపుర్‌లోకి అక్రమ వలసలను ఆపేందుకు 2023 మే 2 వరకు నేను శాయశక్తులా శ్రమించాను. 2023 మే 3న జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత అక్రమ వలసలను కట్టడి చేయడంలో తడబడ్డాం" అని బీరెన్ సింగ్ వెల్లడించారు.
"మయన్మార్‌తో మణిపుర్‌కు ఉన్న సరిహద్దులో 398 కిలోమీటర్ల భాగానికి కాపలా లేదు. సరిహద్దుల్లో స్వేచ్ఛగా కదలికలు సాగించగలిగేలా ఆ దేశంతో ఉన్న ఒప్పందం వల్ల మణిపుర్ సామాజిక సమీకరణాల్లో తేడాలు వస్తున్నాయి" అని బీరేన్ సింగ్ చెప్పారు. "2017 మార్చిలో మేం మణిపుర్‌లో అధికారంలోకి వచ్చాం. పరిస్థితిని చక్కదిద్దాం. 2023 మే 3 నుంచి పరిస్థితి మళ్లీ చేజారింది" అని బీరెన్ సింగ్ తెలిపారు.