Toll Free Numbers TG Govt Departments : ధాన్యం కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు దానిని నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖను రైతులు టోల్ ఫ్రీ నంబరు ద్వారా సంప్రదించవచ్చు. రేషన్ కార్డుల కోసం 180042500333 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. రేషన్ పంపిణీ, ధాన్యం కొనుగోళ్లలో తలెత్తే ఇబ్బందులపై ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఆ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు. సాధారణంగా కార్యాలయ పని వేళల్లో ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
పిల్లల రక్షణకు? : బాలల రక్షణ సహాయ కేంద్రం 1098 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ కేంద్రం పని చేస్తుంది. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేసి ఆ బాలలకు అక్కడి నుంచి విముక్తి కలిగిస్తారు.
అవినీతి నిరోధకశాఖ నంబర్ : సాధారణంగా ప్రజలకు ఏవైనా పనులకు ప్రభుత్వ ఆఫీసులకు వెళుతుంటారు. ఆ శాఖలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం వేధించినా, లంచం ఇవ్వందే పని చేయమని చెప్పినా 1064ను, కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ 9154388954ని సంప్రదించాలి.
రైతుల సహాయానికి నంబర్ : దేశవ్యాప్తంగా రైతుల సందేహాలకు తీర్చేందుకు కిసాన్ కాల్ సెంటర్ (కేసీసీ) 18001801551 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. వారానికి ఏడు రోజుల పాటు పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
వృద్ధుల కోసం : వృద్ధుల కోసం ప్రభుత్వం 14567 టోల్ ఫ్రీనంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పింఛన్లు, ఆరోగ్య సమస్యల గురించి వృద్ధులు ఈ నంబర్‌కు కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించుకునే సదుపాయం ఉంది.
మహిళల వేధింపులకు గురైనప్పుడు : మహిళా సహాయ కేంద్రం కోసం 181 నంబరుకు కాల్ చేసి సమస్యను చెప్పవచ్చు. ఈ సహాయ కేంద్రం పని చేసే చోట వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, వరకట్నం వేధింపులు, ఆడశిశువుల విక్రయం, అక్రమ రవాణాలను నిరోధిస్తుంది. ఇందులోనే ప్రత్యేకంగా గర్భిణుల కోసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మరి విద్యుత్తు సమస్యలు వస్తే? : తెలంగాణ విద్యుత్తుశాఖ ఇటీవల సరికొత్తగా 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను కొత్తగా పరిచయం చేసింది. వినియోగదారులు నేరుగా ఈ నంబర్‌కు ఫోన్ చేయడంతో వారి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు వివరించారు. కాల్ రికార్డు చేయడమే కాకుండా వినియోగదారుడి ఫిర్యాదు సంబంధిత అధికారులకు వెళ్తుంది. ఆ అధికారి ఫిర్యాదును ఎలా పరిష్కరించారో తెలియజేస్తూ ఆ శాఖలోని ఉన్నతాధికారి వివరాలను పంపిస్తారు. ఒకవేళ లంచాలు అడిగితే ఆ ఉద్యోగుల గురించి కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్‌పీడీసీఎల్ దీనికి సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.