Post Graduate Diploma In Banking And Finance : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 1000 ఖాళీలున్నాయి. దీంట్లో అవకాశం వచ్చినవారు కోర్సు పూర్తిచేసిన వెంటనే జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీసర్ హోదాతో సెంట్రల్ బ్యాంకులో చేరిపోవచ్చు. తొలి నెల నుంచే రూ.70 వేలకు పైగా వేతనం ఉంటుంది.
డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగంలోకి : ఇటీవల వివిధ బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపిక చేసి, పీజీ డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరోవైపు ఉద్యోగం రెండూ సొంతం అవుతాయి. వీరు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది చదువునూ ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకుని ఎంబీఏ పట్టా అందుకునే సౌకర్యమూ ఉంది.
ఇంటర్వ్యూ, తుది ఎంపిక : పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత మందిని చొప్పున ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఈ సంఖ్యను సెంట్రల్ బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి 50 మార్కులు. దీంట్లో 25 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 శాతం 22.5 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితాకు ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కులు కలుపుతారు. కేటగిరీల వారీ మెరిట్ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు.
కోర్సు వ్యవధి ఏడాది : పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 9 నెలలు తరగతి గది శిక్షణ, 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 నుంచి 4 లక్షల వరకు చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం. అవసరమైనవారికి సెంట్రల్ బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఐదేళ్లు ఉద్యోగంలో కొనసాగితే కోర్సు ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఐదేళ్ల లోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున్నవారైతే ఫీజుతోపాటు మొత్తం వడ్డీనీ కట్టాలి.
స్టైపెండ్- వేతనం : కోర్సులో ప్రతి నెలా రూ.2500 చొప్పున మొదటి తొమ్మిది మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ.10,000 చొప్పున 3 నెలల ఉద్యోగ శిక్షణలో ఇస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1లో క్రెడిట్ ఆఫీసర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.48,480 మూల వేతనం పొందుతారు. హెచ్‌ఆర్‌ఏ, డీఏ, అలవెన్సులతో కలిపి సుమారు రూ.70,000 ప్రతి నెలా జీతం అందుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష : పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. మొత్తం మార్కులతో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరుగుతాయి.విభాగాల వారీ కటాఫ్ మార్కులు పొందాలి. అలాగే అన్ని విభాగాలూ కలిపి నిర్దేశిత కటాఫ్ కంటే ఎక్కువ సాధించాలి. వీటిని బ్యాంకు నిర్ణయిస్తుంది. రుణాత్మక మార్కులు లేవు.
సన్నద్ధత మెలకువలు : విభాగాల వారీ ఉన్న అంశాలను నెల రోజుల్లో పూర్తిచేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ఆ తర్వాత మాక్ టెస్టులకు కేటాయించాలి. ప్రతి పరీక్ష తర్వాతా ఫలితాలు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీటిని ఒకవైపు రాస్తూనే ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి. దశలవారీ మాక్ పరీక్షల్లో 60కి తగ్గకుండా 70 శాతం మార్కులు పొందేలా సాధన మెరుగుపరచుకోవాలి.
120 ప్రశ్నలకు 90 నిమిషాలు : 120 ప్రశ్నలకు 90 నిమిషాలు. అంటే ప్రతి ప్రశ్నకూ 45 సెకన్ల వ్యవధి ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల్లో ప్రశ్నలకు ఈ సమయం సరిపోదు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే తక్కువ వ్యవధిలో ఎక్కువ సమాధానాలు చేయగలరు.
- విభాగాల వారీ సమయ నిబంధన ఉంది. అలాగే కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. దేన్నీ నిర్లక్ష్యం చేయరాదు. ఇబ్బంది పెడుతున్న అంశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే అన్ని విభాగాల్లో కనీస మార్కులు పొందగలరు.
- పరీక్షలో తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలే ముందు ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ, కచ్చితంగా జవాబు గుర్తించగలిగేవాటిని సాధించాలి.
- కటాఫ్ మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకు ఆలోచించి ఏదో ఒక జవాబు ఇవ్వొచ్చు.
పరీక్షలో ప్రశ్నలు
- రీజనింగ్ ఎబిలిటీ : ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. సమాధానం గుర్తించాలంటే గణిత ప్రాథమికాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్) : బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్‌బీఐ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు ఇవన్నీ చదువుకోవాలి.
- జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా వర్తమాన వ్యవహారాలు ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహననూ పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలకూ ప్రాధాన్యమివ్వాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్ కట్స్ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇందుకోసం నచ్చిన ఆంగ్ల వ్యాసాలు, పుస్తకాలు చదవాలి.
ముఖ్య వివరాలు
- పీజీడీబీఎఫ్ కోర్సులో 1000 ఖాళీలు ఉన్నాయి. జనరల్ 405, ఓబీసీ 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యుఎస్ 100.
- విద్యార్హత: నవంబరు 30, 2024 నాటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యుబీడీలైతే 55 శాతం సరిపోతాయి.
- వయసు: నవంబరు 30, 2024 నాటికి 20 - 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నవంబరు 30, 1994 - నవంబరు 30, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
- పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.750.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 ఆఫీసర్ పోస్టులు - త్వరగా అప్లై చేయండి
రూ. 50వేల జీతంతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు - జనవరి 29 నుంచి ర్యాలీ ప్రారంభం