Blood Circulation Improve Tips: మన శరీరంలోని కొన్ని వ్యవస్థలు గాడి తప్పితే ఆ ప్రభావం ఒక్కోసారి చర్మంపై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే పలు రకాల చర్మ సమస్యలు ఉత్పన్నం అవుతాయంటున్నారు. ఈ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటే శరీరంలోని హానికారక పదార్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఫలితంగా చర్మం లోలోపలి నుంచే నిగారింపును సంతరించుకుంటుంది అని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. మరి వారు సూచిస్తున్నట్లు రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుకుని, అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేయండి: మన జీవనశైలిలో వ్యాయామాలు, వర్కవుట్లను భాగం చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రన్నింగ్, యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ లాంటి వ్యాయామాలను వారంలో 5 రోజుల చొప్పున కనీసం 30 నిమిషాల పాటు చేయాలని సూచిస్తున్నారు. 2018లో Journal of Applied Physiologyలో ప్రచురితమైన "The effects of exercise on blood flow and vascular function in healthy adults: A systematic review" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హెల్దీ ఫుడ్స్: ముఖ్యంగా చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోకపోవడం ఎంతో ఉత్తమమని సూచిస్తున్నారు. వీటి స్థానంలో ఆకుపచ్చని కూరగాయలు, వివిధ రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇందులో సమృద్ధిగా ఉండే ఫైబర్.. రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు.
ఫ్లూయిడ్స్ : ఎలాంటి రసాయన ఉత్పత్తులు వాడకుండా సహజమైన పద్ధతుల్లో అందంగా మెరిసిపోవాలంటే మంచినీరు చక్కటి మార్గమని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల విషతుల్యాలు, హానికారక పదార్థాలు పెరిగిపోయి.. ఈ ప్రభావం కచ్చితంగా చర్మంపై పడుతుందని వివరిస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరంలో తగినంత నీటి స్థాయులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి నీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్‌జ్యూస్‌లను తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
ఫేషియల్ మసాజ్: కొన్ని రకాల ఫేషియల్ మసాజ్‌ల వల్ల కూడా చర్మం సహజంగా మెరుపును సంతరించుకుంటుందని చెబుతున్నారు. ఈ మసాజ్‌ల వల్ల ముఖం, చర్మంపై ఉండే వ్యర్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా ఆక్సిజన్ అందుతుందని.. ఫలితంగా చర్మం మృదువుగా, తాజాగా మారుతుందని అంటున్నారు. రోజూ కనీసం 10-15 నిమిషాల పాటు ఇలా ఫేషియల్ మసాజ్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు. ఇంకా మసాజ్ కోసం జేడ్ రోలర్ వంటి పరికరాలను కూడా వాడచ్చని సూచిస్తున్నారు.
ఆ అలవాట్లకు దూరం: ఈ సూచనలు పాటించడంతోపాట స్మోకింగ్, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలకు లోను కావడంతో పాటు చర్మం నిగారింపును కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఏజ్ పెరిగినా యంగ్‌గా కనిపించాలా? రోజూ డ్యాన్స్ చేస్తే చాలట! ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్!!
అన్ వాంటెడ్ హెయిర్‌తో ఇబ్బందా? ఫేస్ వ్యాక్సింగ్ కంటే ఈజీగా నొప్పి లేకుండా క్లీన్!