Ratha Saptami In Tirumala : మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా జరుపుకుంటాం. ఈ రోజు సూర్యనారాయణుని విశేషంగా పూజిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుడు ఒకే రోజు 7 వాహనాలపై ఊరేగుతూ భక్తులను అలరిస్తాడు. ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకేరోజు సప్త వాహనసేవలు
ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏడు వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం కానున్న రథసప్తమి వేడుకలు, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. ఈ సందర్భంగా రథసప్తమి రోజు ఏ సమయంలో ఏ వాహనసేవ జరుగుతుందో చూద్దాం.
రథసప్తమి ప్రత్యేక వాహన సేవల వివరాలు
- ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ
- ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ
- మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం
- సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ
- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ
- రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ
మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి రోజు జరిగే సప్త వాహనసేవలను ఎవరైతే దర్శిస్తారో వారికి జన్మరాహిత్యం కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని వేంకటాచల మహత్యంలో వివరించారు. ఒకేరోజు ఏడు వాహనాలపై తిరు మాడ వీధులలో ఊరేగే శ్రీనివాసుని దర్శనం అపురూపం అద్వితీయం. తిరుమలలో రథసప్తమి వాహన సేవల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. రథసప్తమి రోజు సప్త వాహనాలపై ఊరేగే శ్రీనివాసుని దర్శనం మూల విరాట్టు దర్శనం రెండు ఒకటే అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.