Indian Railways Launches SwaRail SuperApp: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఇకపై అన్ని రకాల సదుపాయాలూ ఒకే చోట ఉండేలా ఇండియన్ రైల్వే సూపర్ యాప్‌ను తీసుకొచ్చింది. 'స్వారైల్' పేరుతో ఈ యాప్‌ను లాంఛ్ చేసింది. దీంతో ప్రయాణికులు ఇకపై ఒకే యాప్‌లో టికెట్ బుకింగ్, లైవ్ లొకేషన్, ఫుడ్ సైతం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకూ రైల్వేకు సంబంధించి వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్, వెబ్‌సైట్లను సందర్శించాల్సి వచ్చేది. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ వంటి వేర్వేరు యాప్స్‌ను వినియోగించాల్సిందే. ఇదికాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌ను సందర్శించాల్సిన పరిస్థితి ఉండేది.
అయితే ఒక్కోదానికి ఇలా ఒక్కో యాప్‌లను ఉపయోగించాల్సి రావడంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ స్వారైల్ పేరుతో సరికొత్తగా సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
స్వారైల్ యాప్‌లో ఏ ఏ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి?:
- ఈ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ (CRIS) అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో వినియోగదారులు రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
- అంతేకాక ఇందులో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
- పార్శిల్స్ అండ్ డెలివరీలను ఈ యాప్‌లో ట్రాక్ చేయవచ్చు.
- వీటితో పాటు ఈ యాప్‌ని ఉపయోగించి రైలులో ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు.
- కోచ్ స్టేటస్ అండ్ రిఫండ్ క్లెయిమ్ ఫెసిలిటీలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
స్వారైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, iOS ఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వినియోగంలో దీనిపై ఫీడ్‌బ్యాక్‌ను అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.
- ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ముందుగా మొబైల్ యాప్ స్టోర్‌కి వెళ్లి అక్కడ 'స్వారైల్' అని సెర్చ్ చేయండి. అప్పుడు సెర్చ్ రిజల్ట్‌లో కన్పిస్తున్న CRIS షేర్ చేసిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు IRCTC RailConnect, UTS మొబైల్ యాప్స్ ఉన్న వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌తో యాప్‌లో నేరుగా లాగిన్ అవ్వవచ్చు. ఒకవేళ మీ వద్ద ఈ రెండు అకౌంట్స్ లేకుంటే స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించడం ద్వారా కొత్త యూజర్‌గా మీ పేరును నమోదు చేసుకోవచ్చు.
- ఫస్ట్ లాగిన్ సమయంలో అందరు వినియోగదారుల కోసం R-Walletను క్రియేట్ చేశారు. ఇది టిక్కెట్ బుకింగ్స్‌కు ఉపయోగపడుతుంది. మీకు ఇప్పటికే R-Wallet ఉంటే అది ఆటోమేటిక్‌గా లింక్ అవుతుంది. దీంతో మీరు లాగిన్ ప్రక్రియను స్కిప్ చేసి మొబైల్ నంబర్, OTP ద్వారా గెస్ట్ వినియోగదారుగా యాప్‌ను ఓపెన్ చేయొచ్చు.
అయితే భారత రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. పరిమిత సంఖ్యలో యూజర్లు మాత్రమే దీన్ని వినియోగించగలరు. ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లలో తొలి దశలో వెయ్యి మంది యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పించింది.
ఈ మేరకు బీటా టెస్టింగ్ కోసం ఎంపిక చేసిన యూజర్ల సంఖ్య ఇప్పటికే పూర్తయిందని ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది. దీంతో అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. అయితే మున్ముందు బీటా టెస్టర్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. అప్పుడు దీన్ని మరింత మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Dear User,
— Centre For Railway Information Systems (@amofficialCRIS) January 31, 2025
Your wait is over!! Indian Railways 🚂 is offering its SuperApp 📲 for Beta Test.
💎 The Indian Railways - SuperApp is a one-stop solution offering multiple public facing services of Indian Railways.
బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేసి త్వరలో ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఇండియన్ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఫీడ్‌బ్యాక్ ఎలా ఇవ్వాలి?: బీటా వెర్షన్‌ను పరీక్షిస్తున్న ప్రయాణీకులు swarrail.support@cris.org.in కు ఇమెయిల్ చేయడం ద్వారా తమ ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా CRISకి అందించొచ్చు. ఈ యాప్ పూర్తి స్థాయి విడుదలకు ముందుగా యూజర్లు పంచుకున్న అభిప్రాయాలు యాప్‌ను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ మిషన్‌లో సాంకేతిక లోపం- మొరాయిస్తున్న NVS-02 శాటిలైట్!
బాల్యం నుంచే స్మార్ట్‌ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!
ఈవీ రంగంపై కేంద్రం వరాల జల్లు- ఇకపై తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఫోన్ల ధరలు!