SC On PWD candidates Scribes : ఇకపై దివ్యాంగులు అందరూ స్క్రైబ్‌లను(సహాయకులను) పరీక్షలు రాయడానికి తీసుకువెళ్లవచ్చని సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బెంచ్‌మార్క్ వైకల్య (ప్రభుత్వ అధికారం జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం 40 శాతం నిర్దిష్ట వైకల్యం ఉన్న వ్యక్తి) ప్రమాణాలను పాటించకుండానే స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
గుల్షన్ కుమార్ అనే అభ్యర్థి తమకు స్క్రైబ్, కంపెన్సేటరీ టైమ్‌తో పాటు అన్ని సౌకర్యాలని కల్పించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. అనంతరం కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలను రెండు నెలల్లో అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్రానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు
- బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు(పీడబ్ల్యూబీడీ) ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలి.
- 2022 ఆగస్టు 10 నాటి ఆఫీస్ మెమోరాండంను కేంద్రం తిరిగి పరిశీలించాలి. ఆంక్షలను తొలగించి సహేతుకమైన పద్ధతిలో సడలింపులు ఇవ్వాలి.
- అభ్యర్థులు కోర్టుల తలుపు తట్టే కంటే ముందు కేంద్రాన్ని సంప్రదించడానికి వీలుగా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
- దరఖాస్తు చేసిన తర్వాత ఎక్కువ కాలం వేచి చూడకుండా ఉండేలా స్క్రైబ్ సర్టిఫికెట్ చెల్లుబాటును పొడిగించాలి. ప్రస్తుతం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉంది.
- అభ్యర్థులు స్క్రైబ్‌తో తమను తాము పరిచయం చేసుకోవడానికి పరీక్షకు ముందు కొంత సమయం ఇవ్వాలి.
ఈ మేరకు సవరించిన మార్పులతో కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని నియామక సంస్థలు, పరీక్షలు నిర్వహించే సంస్థలు, బోర్డులు పాటించాలని సూచించింది. క్రమానుగుణ సర్వేలు, వెరిఫికేషన్‌తో ఈ మార్గదర్శకాలను పాటించాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.