Manipur CM N Biren Singh Tenders Resignation : మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన వెంట బీజేపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, మణిపుర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎ.శారద, పార్టీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ఉన్నారు. ఫిబ్రవరి 10 నుంచి మణిపుర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు(ఫిబ్రవరి 7న) ప్రకటించింది.
Manipur CM N Biren Singh hands over the letter of resignation from the post of Chief Minister to Governor Ajay Kumar Bhalla at the Raj Bhavan. pic.twitter.com/AOU6MFvScs
— ANI (@ANI) February 9, 2025
ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారం రోజు (ఫిబ్రవరి 8న) అధికార ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేలతో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం వల్ల ఆదివారం ఉదయం బీరేన్ సింగ్ హుటాహుటిన దిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దిల్లీ నుంచి ఇంఫాల్‌కు తిరిగి వచ్చిన వెంటనే బీరేన్ సింగ్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజీనామా లేఖను అందించారు. మణిపుర్ అసెంబ్లీ సెషన్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఈ పరిణామం జరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
'అందుకు గర్విస్తున్నా'
బీరెన్ సింగ్ తన రాజీనామా లేఖలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్ల పాటు మణిపుర్ ప్రజలకు సేవ చేసినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. మణిపుర్ అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు కేంద్ర సర్కారు నుంచి పూర్తి సహకారం లభించిందన్నారు.
ఫిబ్రవరి 10 నుంచి జరగనున్న మణిపుర్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలన్నీ లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి మణిపుర్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈక్రమంలోనే బీరెన్ సింగ్‌ను దిల్లీకి పిలిపించి, మణిపుర్ హింసాకాండతో ముడిపడిన పలు అంశాలపై ఆయనతో చర్చించింది. ఆ వెంటనే ఆయన ఇంఫాల్‌కు తిరిగొచ్చి రాజీనామా చేయడం గమనార్హం.
మణిపర్లో దాదాపు రెండేళ్ల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. 2023 సంవత్సరం మే 3న మొదలైన ఈ ఘర్షణల్లో ఎంతోమంది మాన, ప్రాణాలు నష్టం జరిగింది. దాదాపు 250 మందికిపైగా చనిపోయారు. 65వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.