Special Story on Old Woman In Hyderabad : కమలమ్మ, ఆ ఆరుగురికీ అమ్మ కాదు. ఆమెలో వారికి ఎప్పుడూ అమ్మ కనిపించలేదు. వాళ్లు అద్దెకుండే పోర్షన్లో ఆమె పని మనిషి అంతే. ఐదు పదుల వయసులో ఎముకల గూడుకు అంటుకుపోయిన చర్మం ముడతలతో పోటీ పడేవి కమలమ్మ కట్టే చీర మడతలు. నాలుగు ఇళ్లలో పని చేస్తూ, ఆ డబ్బులతో కుమారుడి కుంటుంబానికి చేదోడుగా ఉండేది ఆమె.
కమలమ్మతో పని చేయించుకునే ఆరుగురూ డిగ్రీలు పూర్తి చేశారు. ఇద్దరు సీఏ చదవాలని, మరో ఇద్దరు సివిల్స్ కొట్టాలని, మిగిలిన ఇద్దరేమో సాఫ్ట్వేర్ కొలువుల్లో చేరాలని సొంతూళ్ల నుంచి కోచింగ్‌ల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఒకరికొకరు పరిచయమై అందరూ కలిసి ఆ ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. ఊళ్ల నుంచి అమ్మనాన్నలు బియ్యం, పచ్చళ్లు, పప్పులతో పాటు ఖర్చులకు డబ్బులు పంపించేవారు. వీళ్లేమో ఇక్కడ ఇష్టమైనవన్ని వండుకుని తింటూ, సినిమాలకు షికార్లకూ తిరిగేవారు. ఖర్చుల్లో దుబారా, చదువుల్లో పొదుపును మాత్రం పక్కాగా పాటించేవారు.
సంతోషించకుండా బాధపడి : కమలమ్మ రెండు పూటల వచ్చేది. పాత్రల్ని తళతళలాడేలా తోమేది. గదంతా శుభ్రంగా ఊడ్చేది. శక్తినంతా కూడగట్టుకుని వాళ్ల బట్టలన్నీ ఉతికేది. బాత్‌రూము కడిగేది. అందుకోసం ఆమెకు అదనంగా డబ్బులిచ్చే వారు కాదు. పని చేయడం ఆమె అవసరం - అన్నట్లుగా భావించేవారు. మొదట్లో పనంతా అయ్యాక మిగిలిన అన్నం కూరల్ని తీసుకెళ్లేది కమలమ్మ. కొన్నాళ్లకు అలా మిగిలిపోయిన వాటినీ తామే తినేసేవారు ఆ కుర్రాళ్లు. అయినా కమలమ్మ బాధపడలేదు. ఒకసారి వాళ్లకు ఊళ్ల నుంచి సరకులు, డబ్బు రావడం కాస్త ఆలస్యమైంది. దాంతో వారం రోజులు గదిలో పొయ్యి వెలగలేదు. వేళకు తినడం అలవాటు పడిన ప్రాణాలు కదా ఆకలికి నరకం చూశారు. ఆరుగురూ పొద్దుటే లేచి ఫ్రెండ్స్ రూములకు వెళ్లి, ఏదో ఒకటి తిని కాలక్షేపం చేసి రాత్రి పొద్దుపోయాక గదికి వచ్చేవారు. పాత్రలు కడిగే పని తప్పిందని కమలమ్మ సంతోషించలేదు, పాపం పిల్లలకు కష్టం వచ్చిందే అని బాధపడింది.
మీకోసం బియ్యం తెచ్చాను : ఒకరోజు పొద్దున్నే తలమీద పది కిలోల బియ్యం మూట, చేతిలో రూ.500 నోటుతో కమలమ్మ రూముకు వచ్చింది. ‘అయ్యా మీరు తినడానికి ఏమీ లేక ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకే బియ్యం తెచ్చా. ఈ డబ్బులతో కూరగాయలు తెచ్చుకోండి.’ అని వారికిచ్చింది. ‘నాలుగు రోజుల క్రితమే తెద్దామనుకున్నా కానీ మా ఇంట్లోవి రేషన్ బియ్యం. వాటిని మీరు తినలేరు. అందుకే నేను పని చేసే వాళ్ల దగ్గర జీతం నుంచి అడ్వాన్సు తీసుకున్నాను. వాటితో మీకు సన్నబియ్యం కొని తెచ్చా'. అని చెబుతున్న కమలమ్మలో ఆరోజు ఆ ఆరుగురికీ అమ్మ కనిపించింది. హైదరాబాద్‌లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన ఈ ఘటన ఆ కుర్రాళ్ల జీవన దృక్పథాన్నే మార్చేసింది.
పింఛన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు! - 8 రోజులుగా శ్మశానంలోనే నివాసం