Released After 23 Years Movie : సాధారణంగా సినిమా తీయడానికి ఏడాది లేదంటే రెండేళ్లు, మరీ కష్టమనుకుంటే 5 ఏళ్లు పడుతుంది. బడ్జెట్, స్టార్ల డేట్స్ వంటి సమస్యల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంటుంది. కానీ 23 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగానే అలాంటి సినిమా ఒకటి ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ సినిమా విడుదల కాకముందే ఇద్దరు హీరోలు, దర్శుకుడు కూడా ప్రాణాలు విడిచారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందుకు అంత టైం పట్టిందో తెలుసుకుందాం.
లైలా- మజ్ను ప్రేమకథ
మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు 'లవ్ అండ్ గాడ్'. కే ఆసిఫ్ దర్శకత్వంలో 1963లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే 1986లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ద్వారా లైలా- మజ్ను ప్రేమకథను చూపించాలనుకున్నారు దర్శకుడు. గురుదత్ మజ్నుగా, నిమ్మి లైలా పాత్రగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే 1964లో గురుదత్ ఆకస్మిక మరణం కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.
గురుదత్ స్థానంలో సంజీవ్
అప్పుడు గురుదత్ స్థానంలో మజ్ను పాత్రకు నటుడు సంజీవ్ కుమార్‌ను తీసుకున్నారు. ఇలా షూటింగ్ జరుపుకుంటుండగా 1971లో చిత్ర దర్శకుడు అసిఫ్ మరణించారు. దీంతో సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అసిఫ్ భార్య అక్తర్ ఆసిఫ్ నిర్ణయించుకున్నారు. ఆమె దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేసీ బొకాడియా సహాయం కోరారు. కొన్ని నెలల్లోనే వారు మూడు వేర్వేరు స్టూడియోల నుంచి షూటింగ్ ఫుటేజీని సంపాదించి సినిమాను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపే మజ్నుగా నటించిన సంజీవ్ కుమార్ కూడా 1985లో తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై రిలీజ్ అయ్యేలోపు ఇద్దరు హీరోలు, దర్శకుడు మరణించారు. అలాగే 23 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.