Two Persons Beaten Constable : అర్ధరాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగింది. కానిస్టేబుల్ ఫిర్యాదుతో దాడికి పాల్పడిన ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన ఇద్దరిలో ఒక యువకుడు బీజేపీ నేత కుమారుడు కావడం విశేషం.
జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ టి.ఈశ్వరరావు శనివారం రాత్రి 12.30 గంటల సమయంలో శ్రీకృష్ణనగర్ సి బ్లాక్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో రోడ్డుపై ముగ్గురు యువకులు మద్యం మత్తులో గొడవ పడుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కానిస్టేబుల్, వారి వద్దకు వెళ్లి వారించే ప్రయత్నం చేశారు. దీంతో నువ్వు ఎవరు? అంటూ కానిస్టేబుల్ ఈశ్వరరావును ప్రశ్నించారు.
అనంతరం కానిస్టేబుల్ అక్కడి నుంచి తన వాహనంపై వెళ్లేందుకు ప్రయత్నించగా శ్రీకృష్ణ నగర్‌కు చెందిన బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కన్వీనర్ కుమారుడు సాయితేజ, అదే ప్రాంతానికి చెందిన జంగం చెల్లారావు అతడిని అడ్డుకొని గొడవకు దిగారు. ఆయన డయల్ 100కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, ఫోన్ లాక్కొని దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్టు చేశారు.
గతంలోనూ యువకుడిపై కేసు : గతంలోనూ ఇదే తరహాలో దాడికి పాల్పడిన ఘటనల్లో సాయితేజపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా సాయితేజ రక్తంలో మద్యం మోతాదు 104 ఎంజీ ఉండగా, చెల్లారావుకు 165 ఎంజీగా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో మహిళపై దాడి, ఆపై కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు - వ్యక్తిపై కేసు నమోదు
అంబర్‌పేట్‌లో మందుబాబు వీరంగం - రాంగ్ రూట్‌లో వెళ్లొద్దన్నందుకు కానిస్టేబుల్‌పై దాడి