AAP Punjab Specific Model : అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాల్లో 'దిల్లీ మోడల్'ను ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఇప్పుడది పునరాలోచనలో పడేసింది. ఈ క్రమంలో పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్‌నకు తన విధానం మార్చుకునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ పనితీరును మెరుగుపరచుకోవాలంటే పంజాబ్‌లో నిర్దిష్ట అభివృద్ధి మోడల్‌పై దృష్టి సారించాల్సిందేనని సూచిస్తున్నారు.
ప్రజల తిరస్కరణకు గురైన ఆప్ నేతలు చెప్పిన దిల్లీ మోడలే ప్రస్తుతం పంజాబ్‌లో అమలు అవుతోంది పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షాహీద్ భగత్ పేర్కొన్నారు. దిల్లీ ప్రజలే దీనికి మద్దతు ఇవ్వకపోతే, ఇంకా పంజాబ్‌లో ఎలా మద్దతు లభిస్తుందని చెప్పారు. దిల్లీలో ఆప్ అనుసరించిన విధానానికి ఎలాంటి ఫలితం వచ్చిందో, అదే మోడల్‌ను అమలు చేస్తున్న పంజాబ్‌కు అదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ అన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పంజాబ్‌లో నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంజాబ్‌లో దిల్లీ మోడల్ పనిచేయదనే పాఠాన్ని వాళ్లు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు.
దాదాపు దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ పొరుగు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో ఉచిత కరెంటు, మహిళలకు నెలకు రూ.వెయ్యి, విద్యతోపాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో దిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. 2022లో పంజాబ్‌లో 117 స్థానాలకు గాను 92 చోట్ల విజయం సాధించి అధికారం చేపట్టింది. 2024లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 13స్థానాలకు గాను కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించగలిగింది.
ఇక దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. పంజాబ్‌లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ, దిల్లీ ప్రజలు మాత్రం ఏ మాత్రం మొగ్గు చూపలేదు. దీంతో రానున్న రోజుల్లో పంజాబ్‌లో ఆప్‌నకు సవాళ్లు ఎదురుకావడమమే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షాలకు ఒక మంచి అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో నేతలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవడం, పార్టీని ఏమేరకు పటిష్టంగా ఉంచుతుందనే విషయంపైనే ఆప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.