How To Keep House Safe From Thieves : ఇంటికి తాళం వేసి ఉంటే చాలు రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తాళాలను పగులగొడుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మేలు. ప్రజలు, పోలీసులు జాగరూకతతో వ్యవహరిస్తే మాత్రమే దొంగతనాలను నిలువరించవచ్చు.
ప్రజలు ఏం చేయాలంటే :
- ఇంట్లో లేనప్పుడు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పెద్దమొత్తంలో నగదును ఉంచవద్దు.
- ఇంటిని పూర్తిగా కవర్ చేస్తూ సీసీ కెమెరాలు బిగించుకోవడం ఉత్తమం. ఈ కెమెరాలను ఇల్లు ఉన్న వీధి పొడవునా ఏర్పాటు చేస్తే చోరీలు జరిగినా దొంగలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
- వేరే ఊరికి వెళ్తున్నప్పుడు బయటి వ్యక్తులకు కనపడకుండా తాళాలు వేసి వెళ్లడం ఉత్తమం. అందరికీ కనిపించే విధంగా బయటి గేట్‌కు తాళం వేసినట్లయితే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు చోరీకి పాల్పడే అవకాశముంది. ఇంటి మెయిన్ గేట్‌కు సెంట్రల్ లాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో మేలు. దీనివల్ల ఇంట్లో ఎవరో ఉన్నారన్న భ్రమతో దొంగలు చోరీ చేయడానికి సాహసించే అవకాశముండదు.
- ఇంటికి తాళాలు వేసి వెళ్లినప్పుడు ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇస్తే మేలు. దీంతో వారు మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు.
- ఇంట్లో దొంగలు పడితే అలారం మోగే సాంకేతికత వ్యవస్థను వినియోగించుకోవడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే అక్కడున్న ఏ వస్తువులను బాధితులు ముట్టుకోకుండా ఉంటేనే క్లూస్ టీం అధికారులకు దొంగల వేలిముద్రల ఆధారాలు దొరికేందుకు అవకాశముంటుంది.
పోలీసులు ఏం చేస్తే బాగుంటుందంటే :
- పోలీసులు పెట్రోలింగ్‌ను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది.
- పట్టణం, గ్రామంలోకి వచ్చే మార్గాల్లో నిరంతర నిఘాతో పాటు హాట్‌స్పాట్ సమయాల్లో వాహనాల తనిఖీలు, బ్రిస్క్ (వేగవంతమైన) పెట్రోలింగ్ చేపట్టడం ఉత్తమం.
- పోలీసులు ఒకే చోట ఉండటం కంటే వాహనాల తనిఖీ, పెట్రోలింగ్, మఫ్టీ పార్టీల్లో పోలీసులను ఏర్పాటు చేస్తే దొంగల ఉనికిని ముందుగానే పసిగట్టేందుకు వీలు కలుగుతుంది.
- ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దొంగల సంచారాన్ని కట్టడి చేయవచ్చు.
తెలియని వారిని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా? - అయితే వారిపై ఓ కన్నేయండి
తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు