Avoid These Unhealthy Combinations With Milk : మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలని డైలీ ఒక గ్లాసు పాలు తాగుతుంటారు. నిజానికి పాలలో కాల్షియం, విటమిన్ ఏ, బీ12, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి పాలు(Milk). అయితే, పాలు ఆరోగ్యకరమైన పానీయమే అయినప్పటికీ.. కొన్ని పదార్థాలతో కలిపి ఎప్పుడూ తీసుకోవద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అలాతీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పాలతో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలు - చేప : మీకు పాలు తాగే అలవాటు ఉందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగాక చేపలు తినకండి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. ఎందుకంటే పాలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటే, చేపలు మాత్రం వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే అది రసాయన మార్పులకు దారితీయడమే కాకుండా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పాలు తాగాక వీలైనంతవరకు చేపలు తినకుండా ఉండడం మంచిది.
పాలు - పుచ్చకాయ :మీరు పాలతో కలిపి తీసుకోకూడని మరో ఆహార పదార్థం పుచ్చకాయ. ఈ కాంబినేషన్ కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా పుచ్చకాయలలో 90% నీటి కంటెంట్ ఉంటుంది. ఇక వాటర్మిలన్లో మూత్రవిసర్జన లక్షణాలు ఉంటే.. అదే పాలలో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. కాబట్టి, పాలు తాగాక పుచ్చకాయ తింటే జీర్ణ సమస్యలు, వికారం వంటి సమస్యలు రావొచ్చంటున్నారు నిపుణులు.
పాలు - అరటి :చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పాలు తాగాక అరటిపండు తింటుంటారు. ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ.. అరటిపండు, పాలు కలిపి తీసుకోవడం మానుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్ జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా మీకు మైకం, అలసటగా అనిపించవచ్చంటున్నారు నిపుణులు.