Diabetes Fruits to Avoid: ప్రతి రోజు పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. కానీ, మధుమేహంతో బాధపడే వారు మాత్రం పండ్లు తినాలంటే భయపడుతుంటారు. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువగా ఉంటుందని.. వాటిని తింటే రక్తంలో షుగర్ స్థాయులు పెరుగుతాయని భయపడుతుంటారు. ముఖ్యంగా కొన్ని పండ్లను తీసుకుంటే మాత్రం చక్కెర స్థాయులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2002లో Journal of the American Dietetic Associationలో ప్రచురితమైన "Glycemic Index of Fruits and Vegetables" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఈ నేపథ్యంలోనే ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే?
మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంత మేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటుంటారు. తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56-69 మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌గా విభజిస్తుంటారు. అయితే, మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తక్కువగా తింటే మంచిదని సలహా ఇస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పుచ్చకాయ: వేసవిలో వచ్చే పుచ్చకాయలో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇందులో 72-80 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని.. ఫలితంగా ఎక్కువ షుగర్ స్థాయులు ఉంటాయని తెలిపారు. అందుకే దీనిని వీలైనంత తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అరటి: సీజన్‌తో సంబంధం లేకుండా ఉండే అరటిలో పండిన శాతం ఆధారంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని వెల్లడిస్తున్నారు. అరటి కాయలో 42-62 వరకు ఉంటుందని.. పండిన తర్వాత ఇంకా ఎక్కువగానే ఉంటుందని వివరిస్తున్నారు. అందుకే వీటిని తక్కువగా తినాలని సూచిస్తున్నారు.

పైనాపిల్: ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని వెల్లడిస్తున్నారు. అందుకే తక్కువ మోతాదులో తినాలని సూచిస్తున్నారు.

మామిడికాయ: వేసవిలో మాత్రమే లభించే మామిడికాయ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. దీంతో ఎక్కువగా తింటుంటారు. ఇందులో 51-60 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, ఫ్రక్టోజ్, సూక్రోజ్ శాతం సైతం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చక్కెర స్థాయులు పెరగకుండా ఉండాలంటే దీనిని తక్కవగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ద్రాక్ష: ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుందని.. కానీ చిన్నగా ఉండడం వల్ల ఎక్కువగా తీసుకుంటామని అంటున్నారు. ఫలితంగా చక్కెర స్థాయులు పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే వీలైనంత తక్కువగా ద్రాక్షను తినాలని సూచిస్తున్నారు.

చెర్రీలు: చెర్రీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయులు రకరకాలుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీలైనంత తక్కువగా తినాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'ఇవి తింటే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది'- బెస్ట్ రిజల్స్ కోసం ఎప్పుడు తినాలి?
రోజూ ఇవి వాడితే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్! అవేంటో మీకు తెలుసా?