Margadarsi Press Note: ఏపీ సీఐడీ ఆరోపణలన్నీ కల్పితం.. స్పష్టం చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్
🎬 Watch Now: Feature Video
Margadarsi Chit Fund Private Limited Press Note: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీపై అచంచలమైన విశ్వాసం, నమ్మకాన్ని ఉంచిన ఖాతాదారులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను, ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఎక్కడా ఉల్లంఘించలేదని చందాదారులకు మార్గదర్శి చిట్‌ఫండ్ హామీ ఇచ్చింది. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా కంపెనీ తన వ్యాపారాన్ని చాలా నిబద్దతతో నిర్వహిస్తోందని ఓ ప్రకటనలో మార్గదర్శి సంస్థ పేర్కొంది. ఆర్థిక క్రమశిక్షణే తమ బలమని, ఏ విషయంలోనూ... చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. తమ చందాదారులందరినీ భయాందోళనలకు గురి చేయడానికి, వేధించడానికి వారి వ్యక్తిగత వివరాల కోసం సీఐడీ పట్టుబడుతోందని.. మార్గదర్శి వ్యాపారాన్ని దాని కస్టమర్ నెట్ వర్క్‌ను దెబ్బతీసే దురుద్దేశాలతో ఏపీ సీఐడీ విచారణ కొనసాగిస్తోందని మార్గదర్శి తెలిపింది.
కంపెనీలో చందాదారునిగా ధృవీకరించిన తర్వాత వారి గోప్యతలో జోక్యం చేసుకోకూడదని ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని మార్గదర్శి సంస్థ ప్రకటనలో గుర్తు చేసింది. కానీ చందాదారుల గోప్యత విషయంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసి ఏపీ సీఐడీ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని మార్గదర్శి పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఏపీ సీఐడీ మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తోందని తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కస్టమర్లందరినీ వేధింపులకు గురి చేస్తుందని ఆ ప్రకటనలో మార్గదర్శి పేర్కొంది. ఏపీ సీఐడీ చర్యల ద్వారా మార్గదర్శి వ్యాపారాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతోందని వెల్లడించింది. ఏపీ సీఐడీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మార్గదర్శిపై చేసిన ఉల్లంఘనలు ఆరోపణలు పూర్తిగా కల్పితాలని, సీఐడీ ఆరోపణలన్నీ అర్హత లేనివని మార్గదర్శి వివరించింది. 1982 చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపు పన్ను చట్టంలో వర్తించే అన్ని ఇతర చట్టాలు, చిట్ ఫండ్ వ్యాపారాన్ని నియంత్రించే నియమాలు, నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని మార్గదర్శి తెలిపింది. ఎక్కడా ఏ విధమైన ఉల్లంఘన పాల్పడలేదని చందాదారులకు మరోసారి గట్టిగా హామీ ఇస్తున్నట్లు మార్గదర్శి ఆ ప్రకటనలో తెలిపింది.