Dry Coconut Health Benefits : సాధారణంగా చాలా మంది ఎండు కొబ్బరిని ఎక్కువగా తీపి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, కొందరు వివిధ కూరలలో వేస్తుంటారు. దీన్ని వేయడం ద్వారా కర్రీలకు మంచి టేస్ట్ వస్తుంది. అయితే, మనందరికీ పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. కానీ, అదే ఎండు కొబ్బరిని డైలీ తీసుకోవడం ద్వారా శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరినీళ్లు, పచ్చికొబ్బరి మాదిరిగానే ఎండు కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలోనూ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, సెలీనియంతో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయట. కాబట్టి, ఎండు కొబ్బరిని రోజువారీ ఆహారాలు, కూరలలో చేర్చడం లేదా ఎండు కొబ్బరి చిన్న ముక్కను నేరుగా తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు. అలాంటి వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
ఎముకలు బలంగా మారుతాయి : ఎండు కొబ్బరిలో పుష్కలంగా ఉండే కాల్షియం బోన్స్ బలంగా మారడానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అలాగే, కీళ్ల నొప్పులు తగ్గడానికి దీనిలోని పోషకాలు సహాయపడతాయని చెబుతున్నారు.
2018లో "ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ మెటబాలిజం" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ఎండు కొబ్బరి తినే వారిలో ఎముక విరిగే ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్‌లో దిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే ఎముకల సంబంధించిన నిపుణులు డాక్టర్ శ్రీనివాసన్ రామ్ పాల్గొన్నారు. డ్రై కోకోనట్లో ఉండే ఖనిజాలు, పోషకాలు బోన్స్ బలంగా మారడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఎండు కొబ్బరి సహాయపడుతుంది. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అందుకు చాలా బాగా ఉపకరిస్తాయట. ఫలితంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, వివిధ అనారోగ్య సమస్యలు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు.
రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు : రక్తహీనతతో బాధపడే వారు ఎండు కొబ్బరిని డైలీ డైట్లో చేర్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఎందుకంటే దీనిలో సమృద్ధిగా ఉండే ఐరన్ బాడీలో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందట. ఫలితంగా రక్తహీనతకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు! : రోజూ వివిధ వంటకాలలో వేయడం లేదా నేరుగా చిన్న ఎండుకొబ్బరి ముక్కను తిన్నా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. దీనిలో ఉండే మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు.
బ్రెయిన్‌కి మేలు : మెదడు పనితీరు మెరుగయ్యేందుకూ, మతిమరుపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. అదేవిధంగా, జుట్టు ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి దీనిలో ఉండే చాలా బాగా తోడ్పడతాయంటున్నారు.
చూశారుగా.. ఎండు కొబ్బరితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో కాబట్టి మీరూ డైలీ చిన్న ముక్క అయినా ఎండు కొబ్బరి తినడం లేదంటే రోజువారీ వంటలలోనైనా చేర్చుకోండని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అందం నుంచి ఆరోగ్యం వరకు - కొబ్బరి పాలతో కోటి ప్రయోజనాలు - జస్ట్ ఇలా తీసుకుంటే చాలు!
కొబ్బరి నూనె జుట్టుకే కాదు - ఈ పనులకూ ఉపయోగపడుతుంది! ఓ సారి ట్రై చేయండి!