Hyderabad Emission Report : వాయు నాణ్యతను ప్రభావితం చేస్తున్న కాలుష్య కారకాలు ఇళ్ల నుంచి కూడా వెలువడుతున్నాయని ‘హైదరాబాద్ ఎమిషన్స్’ అనే నివేదిక వెల్లడించింది. కార్బన్ మొనాక్సైడ్, పీఎం (particulate matter) 10, పీఎం 2.5, నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు 10 నుంచి 15 శాతం ఇళ్ల నుంచే వెలువడుతున్నాయని రిపోర్టు తేటతెల్లం చేసింది. దక్షిణ భారతదేశంలో పరిశ్రమలు, ఇళ్లే ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నాయని ‘ఐఐటీ రూర్కీ’, మహారాష్ట్రలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ’ల సంయుక్త అధ్యయనాలు సైతం ఇదే అంశాన్ని వెల్లడించాయి. హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాల్లో 94 శాతం మంది ఎల్పీజీ(గ్యాస్)ని ఇంధనంగా వాడుతుండగా ఇంకో 6 శాతం మంది కట్టెలు, ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారని ‘హైదరాబాద్ ఎమిషన్స్’ నివేదికలో తెలిపింది.
అధ్యయన ఫలితాలు : రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 16 ప్రాంతాల్లో 84 శాతం మంది ఎల్పీజీని, 16శాతం మంది ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో 150 వార్డులతోపాటు, మరో 16 ఇతర ప్రాంతాలపై అధ్యయనం చేసి వివరాలను తెలిపింది. ప్రత్యామ్నాయాలను వంట కోసం వాడుతున్నవారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రజలు, మురికివాడల్లో నినసిస్తున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో రాజధాని పరిధిలో రోజూ విడుదలయ్యే పీఎం 10 కాలుష్య ఉద్గారాలు 5 శాతం గృహాల నుంచే ఉంటోందని తెలిపింది. పీఎం 2.5 ఉద్గారాలు 9 శాతం, కార్బన్ మొనాక్సైడ్ 15 శాతం వరకు ఉంటోంది.
కారణాలు : నివాసాలతో పాటు, హోటళ్లు, దాబాల్లో వంట చేయడానికి విరివిగా కట్టెలు వాడుతున్నారు. గ్రామీణులు, పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరలేదని విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో 30 వేలకు పైచిలుకు మంది పేద మహిళలకు మాత్రమే ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్, సిలిండర్, స్టవ్‌ను అందించారు. ఈ పథకానికి అర్హులయ్యే లబ్ధిదారులు ఎక్కువగా ఉండటమూ ఈ పరిస్థితికి కారణమంటున్నారు నిపుణులు.
ఓవైపు చలి - మరోవైపు కాలుష్యం - హైదరాబాద్‌లో ఆరోగ్యం 'గాలి'లో దీపమేనా?
హైదరాబాద్‌లో క్షీణిస్తున్న వాయునాణ్యత - ఆ ప్రాంతాల్లో అయితే ఊపిరాడట్లే!