New Income Tax Bill 2025 : భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. 'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనున్నారు. సంక్షిప్తంగా, సులభంగా చదవగలిగేలా ఉండే ఈ బిల్లులో 536 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 622 పేజీలు ఉంటాయి. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే, ఆరు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం-1961' చరిత్ర పుటల్లో కలిసిపోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో గత కొన్ని దశాబ్దాల్లో చాలా సవరణలు, మార్పులు, చేర్పులు జరిగాయి. దీంతో అది ఎంతో సంక్లిష్టంగా మారింది. ఇందులోని భాష, పదజాలం చదవలేని విధంగా కఠినంగా ఉన్నాయి.
ప్రీవియస్ ఈయర్, అసెస్‌మెంట్ ఈయర్‌లకు గుడ్‌బై
ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలోని 'గత ఏడాది' (ప్రీవియస్ ఈయర్) అనే పదాన్ని 'పన్ను సంవత్సరం' (ట్యాక్స్ ఈయర్) అనే పదంతో రీప్లేస్ చేయనున్నారు. 'అసెస్‌మెంట్ ఈయర్' (మదింపు సంవత్సరం)కు సంబంధించిన కాన్సెప్టును కూడా మార్చారు. ప్రస్తుతానికి 'గత సంవత్సరం' (2023-2024)లో మనం సంపాదించిన ఆదాయానికి 'మదింపు సంవత్సరం'(2024-25)లో పన్నును చెల్లిస్తాం. ఇందులో ఉన్న గత సంవత్సరం, మదింపు సంవత్సరం అనే కాన్సెప్టులను తొలగించారు. కేవలం 'పన్ను సంవత్సరం' (ట్యాక్స్ ఈయర్) అనే భావన మాత్రమే నూతన ఆదాయపు పన్ను బిల్లులో ఉంది.
సెక్షన్లు, షెడ్యూళ్లు, ఛాప్టర్లలో మార్పులివీ
నూతన ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టంలో సెక్షన్ల సంఖ్య 298 మాత్రమే. ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూళ్లు ఉండగా, నూతన బిల్లులో 16 షెడ్యూళ్లు ఉంటాయి. ఛాప్టర్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు. అవి స్థిరంగా 23గానే ఉన్నాయి. పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించి 622 చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో సగానికిపైగా సవరణలు, మార్పులు, చేర్పులే. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు, దానిలోని పేజీల సంఖ్య 880.
స్టాక్ ఆప్షన్లపై 60 ఏళ్ల కోర్టు తీర్పులతో
స్టాక్ ఆప్షన్ల(ESOPs)పై విధించే పన్నులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను నూతన ఆదాయపు పన్ను బిల్లులో పొందుపరిచారు. వీటివల్ల వాటితో ముడిపడిన న్యాయవివాదాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. గత 60 ఏళ్లలో స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వివిధ కేసుల్లో వచ్చిన కోర్టు తీర్పులను కూడా నూతన బిల్లులో ప్రస్తావించారు.
సీబీడీటీకి అదనపు అధికారాలు
నూతన ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (CBDT) అనేది పన్ను నిర్వహణ నియమాలను రూపొందించవచ్చు. పన్ను చెల్లింపులపై అనుశీలన చేయడం, పన్ను చెల్లింపుదారులతో జవాబుదారీగా వ్యవహరించడం, చట్టాల్లో సవరణలు అక్కర్లేకుండానే డిజిటల్ ట్యాక్స్ పర్యవేక్షక వ్యవస్థల అమలును సీబీడీటీ చేపట్టొచ్చు. ఈ విషయాన్ని నూతన బిల్లులోని 533వ క్లాజ్‌లో పొందుపరిచారు.
22 ప్రత్యేక ఉప కమిటీలతో
నూతన ఆదాయపు పన్ను బిల్లు రూపకల్పన విషయానికొస్తే- ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ అంశాలపై అధ్యయనం చేయడానికి 22 ప్రత్యేక ఉప కమిటీలను నియమించారు. భాషను సరళతరం చేయడం, న్యాయవివాదాలకు తావు లేకుండా మార్చడం, అనవసరమైన నిబంధనలను తొలగించడం అనే విభాగాల్లో సలహాలను, సిఫార్సులను స్వీకరించారు. ఈ అంశాలపై ఆదాయపు పన్ను విభాగానికి దాదాపు 6,500 సలహాలు, సూచనలు అందాయి. వీటన్నింటిని సమీక్షించాకే నూతన ఆదాయపు పన్ను బిల్లును రూపొందించారు.