PM Modi US Visit 2025 : అమెరికా అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్ రెండోసారి చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశం వెళ్తున్నారు. ఈ పర్యటనలో సాంకేతికత, వాణిజ్యం, రక్షణ, ఇంధన, ప్రపంచ భద్రతా సవాళ్లు తదితర అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారం చేపట్టిన తర్వాత వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరలేపారు. చైనా ఉత్పత్తులపై 10 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధించారు. స్టీల్, అల్యూమినియంను భారత్ కూడా అమెరికాకు ఎగుమతి చేస్తోందని సుంకాల ప్రభావం మన దేశంపైనా ఉంటుందని మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌లోని చాబహర్ పోర్టుపై అమెరికా ఆంక్షలు కూడా మోదీ, ట్రంప్ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
"స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించినట్లు మనం వార్తల్లో చూస్తున్నాం. ఈ రెండింటినీ భారత్ కూడా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు చాబహర్ పోర్టుపైనా ట్రంప్ ఆంక్షలు విధించారు. అది కూడా భారత్‌పై ప్రభావం చూపుతుంది. మధ్యఆసియా, అఫ్గానిస్థాన్, భారత్ మధ్య కనెక్టివిటీకి చాబహర్ పోర్టు ఎంతో కీలకం. ఇవన్నీ ట్రంప్‌తో మోదీ భేటీలో చర్చకు వస్తాయని నేను భావిస్తున్నాను."
--అనిల్ త్రిగుణాయత్, మాజీ దౌత్యవేత్త
VIDEO | Prime Minister Narendra Modi (@narendramodi) departs for Washington DC after concluding France visit.
— Press Trust of India (@PTI_News) February 12, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Ug9IOvwvOf
అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలే ట్రంప్-మోదీ మధ్య చర్చల్లో కీలక అంశం కానున్నాయి. గతంలో అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అని ట్రంప్ ఆరోపించారు. అయితే మోదీ అమెరికా పర్యటనకు ముందే లగ్జరీ కార్లు, మోటారు సైకిళ్లు సహా కొన్ని దిగుమతులపై భారత్ టారిఫ్‌లు తగ్గించింది.
"మరిన్ని సుంకాలను విధిస్తానని ట్రంప్ చెబుతున్నారు. అది వాణిజ్య లోటు భర్తీ కోసం కాదు- అమెరికాకు ఆదాయాన్ని సృష్టించడానికి, సరిహద్దు పన్ను కోసం తనకు ఆదాయాన్ని సృష్టించుకోవడానికి. కాబట్టి అది రక్షణాత్మకమైనది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తనకు తాను రక్షించుకోవాలి. భారత్‌లో పరిశ్రమలను రక్షించుకోవాలి. అది సాధారణం. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారమే భారత్ నడుచుకుంటోంది."
--అనిల్ త్రిగుణాయత్, మాజీ దౌత్యవేత్త
కలిసికట్టుగా ఉగ్రవాద వ్యతిరేక పోరు
ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరుపై కూడా ట్రంప్-మోదీ మధ్య చర్చలు జరగనున్నాయి. తమ రక్షణ రంగ ఉత్పత్తులను కొనేలా భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలను అమ్మాలని చూస్తోంది. సంయుక్త సైనిక విన్యాసాలను మరింత విస్తరించాలని భారత్-అమెరికా భావిస్తున్నాయి. సాంకేతికత బదిలీ ఒప్పందాలపై చర్చించనున్నాయి. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్-అమెరికా యోచిస్తున్నాయి.
"ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ట్రంప్ నేర్పరి. ట్రంప్ ప్రధాన లక్ష్యం సుంకాల ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకురావడం. తద్వారా అమెరికాకు చెందిన మరిన్ని రక్షణ పరికరాలను భారత్ కొనుగోలు చేసేలా చేయడం. రానున్న ఆరు నుంచి 8 నెలల కాలంలో భారత్-అమెరికా మధ్య కొన్ని పెద్ద రక్షణ ఒప్పందాలు జరగనున్నాయని నేను భావిస్తున్నాను."
--భాస్వతి ముఖర్జీ, మాజీ దౌత్యవేత్త
హెచ్1బీ వీసాలు
అక్రమ వలసదారులు, హెచ్1బీ వీసాల అంశం మోదీ-ట్రంప్ మధ్య చర్చల్లో మరో ప్రధాన అంశం కానుంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 100 మందికిపైగా భారతీయులను ఇటీవల సైనిక విమానంలో అమెరికా తిప్పి పంపింది. భారతీయులకు అమెరికా వీసాలను తగ్గించనుందని వార్తలు వినిపిస్తున్న వేళ అలాంటివి జరగకుండా ట్రంప్‌తో మోదీ చర్చించే అవకాశం ఉంది. హెచ్1బీ వీసాలు, విద్యార్థి వీసాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రంప్‌తో మోదీ సంప్రదింపుల జరపవచ్చు.
"హెచ్1బీ వీసా అంశం భారత్‌కు చాలా ముఖ్యమైనది. అమెరికాలో అనేక భారతీయ సంస్థలు పని చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు కూడా భారత్ నుంచి ఐటీ ఉద్యోగులను కోరుకుంటున్నాయి. తొలుత హెచ్1బీ వీసాలను రద్దు చేస్తానని ట్రంప్ అన్నారు. కానీ ఇప్పుడు అమెరికాలోకి వచ్చి పని చేయడానికి తెలివైన వ్యక్తులు కావాలని అంటున్నారు. భారత ఉద్యోగులను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. అమెరికా రాజకీయాలు, వ్యాపారాల్లో కీలకమైన వ్యక్తి ఎలాన్ మస్క్‌తో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ ఇదే మాట అన్నారు."
--ఖమర్ అఘా, రక్షణ నిపుణుడు
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులపై కూడా ట్రంప్-మోదీ చర్చించనున్నారు. అమెరికాతో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకుంటూనే, అమెరికాకు గిట్టని రష్యా, ఇరాన్‌తో భారత్‌కు మెరుగైన సంబంధాలు ఉండటం, ఆంక్షలు, ఉమ్మడి ఆందోళనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.