Telangana Local Body Elections Likely To Be Postponed Again : స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు ఆలస్యం కావచ్చని సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చ జరుగింది. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తిప్పి కొడతాం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుందందని, శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకులను కలుస్తామని, దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తిప్పి కొడతామని, రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నామని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం సమీక్ష - రిజర్వేషన్లపై చర్చ