Back Pain Treatment in Ayurveda: ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం, అధిక సమయం డ్రైవింగ్ చేయడం, పోషకాహార లోపం వంటి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నడుము నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది పెయిన్ బామ్స్, పెయిన్ కిల్లర్స్ వినియోగిస్తుంటారు. కానీ, వీటివల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం లభిస్తుందని అంటుంటారు. ఈ నడుము నొప్పి తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల దుంపరాష్ట్రం చూర్ణం
- 25 గ్రాముల ఆముదపు వేరు చూర్ణం
- 25 గ్రాముల దేవదారు చూర్ణం
- 25 గ్రాముల పునర్నవ చూర్ణం
- 25 గ్రాముల గోక్షురా (పల్లేరు) చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో దుంపరాష్ట్రం, ఆముదపు వేరు, దేవదారు, పునర్నవ, గోక్షూరా చూర్ణాలు వేసుకుని బాగా కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో 100 మిల్లిలీటర్ల నీళ్లు, 5 గ్రాముల మిశ్రమం పోసి మరిగించాలి.
- దీనిని సన్నటి మంటపై పెట్టుకుని నాలుగో వంతు నీరు ఆవిరయ్యే వరకు వేడి చేసుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని వడపోసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు.
- దీనిని ఆహారం తీసుకున్న 10 నిమిషాల తర్వాత ఉదయం, సాయంత్రం రెండు పూటల తీసుకోవాలని అంటున్నారు.
దుంపరాష్ట్రం: ఇది కీళ్ల నొప్పులు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. అలాగే వెన్ను పూసల మధ్యలో నొప్పిని కూడా తగ్గించడంలో సహాయ పడుతుందని అంటున్నారు.
ఆముదపు వేరు; ఇది రకరకాల వాత దోషాన్ని తగ్గించడానికి ఎంతో సహాయ పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గిస్తుందని అంటున్నారు.
పునర్నవ: నడుము నొప్పి ఉన్నప్పుడు ఏర్పడే వాపు, నీటిని తగ్గిస్తుందని వివరిస్తున్నారు. ఇది వాతదోషాన్ని తగ్గించడంలో సహాయ పడుతుందని అంటున్నారు.
గోక్షూరా: ఇది వాతదోషంతో పాటు నడుము నొప్పితో ఏర్పడే వాపును తగ్గిస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?
'ఈ చిన్న మార్పులతో బెల్లీ ఫ్యాట్ సమస్యకు గుడ్ బై'- మీరు ట్రై చేయండి!