Rose Rasmalai Phirni Recipe in Telugu : కొత్త సంవత్సరం రోజు చాలా మంది వివిధ స్వీట్ రెసిపీలు ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికోసం ఒక సూపర్ స్పెషల్ స్వీట్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "రోస్ రసమలై ఫిర్నీ గ్లాస్ జార్ డిసర్ట్". న్యూ ఇయర్ పార్టీలకే కాదు ఇంకేదైనా స్పెషల్ అకేషన్స్‌కి ఈ స్వీట్ రెసిపీ మస్త్ మజాను అందిస్తుంది. ఇంటిల్లిపాదీ దీన్ని టేస్ట్ ముందు ఫుల్ ఖుష్ అవ్వడం పక్కా! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ న్యూ ఇయర్‌కి మీ ఇంట్లోనూ ఈ సూపర్ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. సరికొత్త ఆనందాన్ని, అనుభూతిని పొందండి.
కావాల్సిన పదార్థాలు :
రసమలై ఉండల కోసం :
- వెనిగర్ - పావు కప్పు
- ఆవు పాలు - లీటర్
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్‌స్పూన్
చక్కెర సిరప్ కోసం :
- పంచదార - 1 కప్పు
- వాటర్ - 6 కప్పులు
రసమలై జ్యూస్ కోసం :
- పాలు - అరలీటర్
- రోస్ ఎసెన్స్ - 4 నుంచి 5 డ్రాప్స్
- రోస్ కలర్ - 3 డ్రాప్స్
- పంచదార - పావు కప్పు
ఫిర్నీ కోసం :
- బాస్మతి బియ్యం - పావు కప్పు
- నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
- పాలు - అర కప్పు
- వాటర్ - అర కప్పు
- వెనీలా ఎసెన్స్ - 1 టీస్పూన్
- కండెన్స్డ్ మిల్క్ - ముప్పావు కప్పు
విప్డ్ క్రీమ్ కోసం :
- విప్డ్ క్రీమ్ - 1 కప్పు
- వెనీలా ఎసెన్స్ - 1 టీస్పూన్
- కండెన్స్డ్ మిల్క్ - పావు కప్పు
- బాదం, పిస్తా ముక్కలు - కొన్ని(గార్నిష్ కోసం)
పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్జామున్" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్!
తయారీ విధానం :
- ముందుగా రసమలైను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో అరకప్పు నీటిలో వెనిగర్ వేసి కలిపి పక్కనుంచాలి. మరో గిన్నెలో కాసిన్ని వాటర్, ఆవుపాలు పోసి కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని పాలను కాస్త చల్లార్చుకోవాలి. అప్పుడు అందులో కలిపి పెట్టుకున్న వెనిగర్ ముందుగా కొద్దిగా వేసి నిదానంగా కలపాలి. ఆ తర్వాత మిగతా వెనిగర్ వేసి కలిపితే ఆ మిశ్రమం పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా విడిపోతుంది.
- అనంతరం ఒక ఖాళీ గిన్నెలో జాలి గంటెను ఉంచి దానిపై ఒక పల్చని కాటన్ క్లాత్ కప్పి పాల మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఆపై క్లాత్లోని మిశ్రమంలో అది చల్లారే వరకు చల్లని వాటర్ పోస్తూ బాగా కడగాలి. లేదంటే వెనిగర్‌లోని పులుపు అలాగే ఉండిపోతుందని గమనించాలి.
- ఆ తర్వాత చల్లారిన పనీర్ ఉన్న క్లాత్‌ను చుట్టలా చుట్టి చేతితో బాగా పిండుతూ అందులోని అదనపు వాటర్‌ను పిండేయాలి. ఆపై దాన్ని అరగంట నుంచి గంట పాటు సింక్ దగ్గర అలా కట్టి వదిలేస్తే దానిలోని మిగతా వాటర్ అంతా బయటకు వెళ్లిపోతుంది.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డలా మారిన పనీర్ ముద్దని వేసుకొని చిదుముకోవాలి. ఆపై అందులో కార్న్‌ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకొని చేతితో వత్తుకుంటూ మృదువైన పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆపై ఆ పిండి ముద్దను ఉసిరికాయ పరిమాణంలో ఉండలుగా చేసుకొని.. కట్లెట్ షేప్ వచ్చేలా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక వాటిపై ఒక తడిగుడ్డ కప్పి పక్కనుంచాలి.
న్యూ ఇయర్ కోసం రొటీన్ కేక్ వద్దు - "ఎగ్‌లెస్ క్యారెట్ చీజ్ కేక్" సూపర్ - ఇలా చేయండి!
- ఇప్పుడు చక్కెర సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై అడుగు లోతుగా ఉండే మూకుడు పెట్టుకొని పంచదార వేసి వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద చక్కెర పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి.
- ఆ విధంగా మరిగించుకున్నాక అందులో ముందుగా చేసుకున్న మలైలను చేతితో మరోసారి తట్టి నెమ్మదిగా పాకంలో వేసుకొని మూతపెట్టి హై ఫ్లేమ్ మీద పావుగంట పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం మూత తీసి చూస్తే ఉండల పరిమాణం రెట్టింపు అవుతుంది. అప్పుడు వాటిని మరోవైపునకు టర్న్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు సిమ్‌లో మరిగించుకోవాలి.
- ఆ తర్వాత ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని సగభాగం వరకు షుగర్ సిరప్ పోసుకోవాలి. ఆపై అందులో ఉడికించుకున్న మలై ఉండలను ఒక్కొక్కటిగా వేసుకొని అరగంట పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా రసమలై ఉండలు మరీ మెత్తగా ఉడకకుండా త్వరగా కూల్ అవుతాయి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన రసమలై జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని పాలు పోసి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు రాగానే రోస్ ఎసెన్స్, రోస్ కలర్, పంచదార వేసి కలిపి మరో పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత దింపి చల్లార్చుకోవాలి.
- పాల మిశ్రమం చల్లారాక అందులో ఐస్‌క్యూబ్స్‌లో వేసుకున్న ఉండలను అదనపు షుగర్ సిరప్ తొలగిపోయేలా చేతితో జాగ్రత్తగా వత్తుకొని వేసుకోవాలి.
- అనంతరం ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో కనీసం 5 నుంచి 6 గంటలైనా ఉంచాలి. అప్పుడు అవి పాల మిశ్రమాన్ని పీల్చుకొని చక్కగా తయారవుతాయి.
- ఆలోపు ఫిర్నీ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో బాస్మతి బియ్యాన్ని వేసుకొని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఆ రవ్వను ఒక బౌల్లోకి తీసుకొని అరగంట పాటైనా నానబెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక అందులో నానబెట్టుకున్న రవ్వను వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత పాలు, వాటర్ పోసి పాయసం వండుకున్నట్లుగా దగ్గరగా ఉడికించుకోవాలి. అప్పుడు అందులో వెనీలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి దింపేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే "రసమలై" - ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్!
- ఇప్పుడు ఒక బౌల్లో కూల్‌గా ఉన్న విప్డ్ క్రీమ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వెనీలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ వేసి మరోసారి బాగా బీట్ చేసుకోవాలి.
- ఈ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని అనంతరం నాజిల్ వేసుకున్న పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని పక్కనుంచాలి. అలాగే ఫ్రిడ్జ్‌లో ఉంచిన రసమలైలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని అడుగు భాగంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెండు చెంచాల ఫిర్నీని వేసుకోవాలి. ఆపై 2 రసమలైలను ముక్కలుగా చేసి పెట్టండి. దానిపై కాస్తంత విప్డ్ క్రీమ్‌ని పైపింగ్ చేయాలి.
- ఆపైన మరో 2 చెంచాల ఫిర్నీని వేయండి. తర్వాత మరికొద్దిగా విఫ్డ్ క్రీమ్‌ని వేసుకోవాలి. ఆఖర్లో కొన్ని రసమలై ముక్కలు, బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
- ఆపై మూతపెట్టి ఆ గ్లాస్ జార్ని ఫ్రిడ్జ్‌లో ఉంచితే కనీసం 3 నుంచి 4 రోజుల పాటు తాజాగా ఉంటుంది! అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "రోస్ రసమలై ఫిర్నీ స్వీట్ డిసర్ట్" రెడీ!
నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్" - ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్!