New Ration Cards For Hyderabad People : అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. దీనికోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
వారంలోపే కీలక నిర్ణయం : కొత్త రేషన్ కార్డుల కోసం హైదరాబాద్ నగరవాసుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. సంక్రాంతి తరువాత ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు స్పష్టత ఇవ్వడంతో ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. నగరం నుంచి కొత్తగా దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అధికార వర్గాల అంచనా. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39,506 రేషన్ కార్డులు ఉండగా, 15 నుంచి 20 శాతం పెరుగుదల ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అనుకుంటున్నారు.
హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పరిధిలో ప్రస్తుతం 653 చౌక ధరల దుకాణాలు ఉండగా, వీటిలో 66 డీలర్ల స్థానాలు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం 587 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హతలను నిర్దేశించి అవకాశం కల్పించినప్పుడు కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ విషయమై కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వారంలోపే కీలక నిర్ణయం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ! : తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటి స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, తిరిగి నిరుపేదలకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు 'పేదలకు సన్నబియ్యం పంపిణీ' అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్ - ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ!
రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేయాలా? - ఇలా ఈజీగా చేసేయండి!