Issues in Indiramma Houses Survey : పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో కొందరు అర్హుల పేర్లు కనిపించడం లేదు. తమ పేర్లు నమోదు కాకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో స్పష్టంగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేరు రాకపోవడం ఏమిటని అధికారుల వద్ద వారి గోడు వెల్లబోసుకుంటున్నారు. కేవలం ఒక్క వికారాబాద్ జిల్లాలోనే సుమారు 20,000 నుంచి 30,000 మంది పేర్లు సర్వే చేసేందుకు జాబితాలో రాలేదని అధికారులే అంటున్నారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎంత మంది ఉన్నారో అని కనుక్కునే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
కుటుంబాల సర్వే వివరాలు యాప్‌లో నిక్షిప్తం : వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 2,57,664 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి సెల్ ఫోన్ యాప్‌లో వారి ఇంటి పరిస్థితి, యజమాని, అతడిని ఇంటి ముందు నిల్చోబెట్టిన చిత్రం ఇలా 3 చిత్రాలు తీసి నమోదు చేస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,07,053 మంది కుటుంబాల సర్వే వివరాలను అధికారులు యాప్‌లో నిక్షిప్తం చేశారు.
తప్పిదం ఎక్కడ జరిగింది? : జిల్లాలో సుమారు ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది పేర్లు సర్వే చేసేందుకు జాబితాలో రాలేదని అధికారులే అంటున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకునే టైంలో కొందరు ఇల్లు కావాలనే వివరం వద్ద టిక్ చేయకపోవడం, లబ్ధిదారుల ఆధార్ సంఖ్య, చరవాణికి అనుసంధానం కాకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పుగా నమోదు చేయడం ఇతర కారణాలను వివరిస్తున్నారు.
మాకు న్యాయం చేయండి : ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నానని తాండూరు 34వ వార్డుకు చెందిన హేమలత తెలిపారు. తమ కాలనీలో అధికారులు వచ్చి సర్వే చేశారని గుర్తు చేశారు. తన పేరు లేదని, తమ వివరాలు, చిత్రం తీసుకోకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇంకా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అనేక చిక్కుముళ్లు! - ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?!!
'ఊత కర్ర' ఉంటేనే ఇందిరమ్మ ఇళ్ల సర్వే - ఆ ఊళ్లో అధికారులకు వింత అనుభవం