How to Make Rava Sweet Cake: కేక్ పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు నోట్లో నీళ్లు ఊరుతాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఎంగేజ్మెంట్, పార్టీ, ఫంక్షన్, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే కేక్‌కు ఫ్యాన్స్ ఎక్కువే. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇక కేక్ కావాలంటే బేకరీకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలంటే మైదా, బేకింగ్ సోడా, బేకింగ్‌పౌడర్, ఎగ్స్ అంటూ చాలా సరంజామ కావాలి. అందుకే చాలా మంది బేకరీకి వెళ్లి నచ్చిన కేక్ తెచ్చుకుంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా, మైదా, పెరుగు, సోడా, ఎగ్స్ ఇలాంటివి ఏవి లేకుండా తినాలనిపించినప్పుడా కేవలం నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే ఈ స్వీట్ కేక్‌ను ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- పాలు - అర లీటర్
- నెయ్యి - సరిపడా
- బొంబాయి రవ్వ - ముప్పావు కప్పు(13 గ్రాములు)
- పంచదార - 1 కప్పు(200 గ్రాములు)
- యాలకుల పొడి - అర టీ స్పూన్
- సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్(జీడిపప్పు, బాదం, పిస్తా) - పావు కప్పు
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పాలు పోసుకుని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పావు కప్పు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి సిమ్‌లో దోరగా మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- దోరగా వేయించుకున్న రవ్వను ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి కాగిన పాలు పోసుకుని బాగా కలిపి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి రవ్వ వేయించుకున్న పాన్ పెట్టి మరో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పంచదార వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
- పంచదార కరిగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు(కేరమిల్ సిరప్) సిమ్‌లో పెట్టి నిధానంగా కలుపుతుండాలి.
- పంచదార కరిగి రంగు మారి సిరప్‌లా అయిన తర్వాత నానబెట్టుకున్న రవ్వ, పాల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
- మంటను మీడియంలో పెట్టి రవ్వ మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించుకోవాలి.
- రవ్వ మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా నెయ్యి పైన తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని లోపల మొత్తం నెయ్యి అప్లై చేయాలి. ఆ తర్వాత బటర్ పేపర్ లేదా కేక్ మౌల్డ్ సైజ్‌లో రౌండ్‌గా కట్ చేసుకున్న వైట్ పేపర్ అయిన వేసుకోవచ్చు.
- ఆపైన ఆ పేపర్‌కు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. అనంతరం సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్‌ను వేసుకోవాలి.
- ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులోకి వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పై భాగంలో కూడా డ్రై ఫ్రూట్స్‌ను వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న కేక్ మౌల్డ్‌ను పూర్తిగా చల్లారేవరకు పక్కన ఉంచాలి.
- పూర్తిగా చల్లారిన తర్వాత కేక్‌ను మౌల్డ్ నుంచి సెపరేట్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిని కట్ చేసుకుని తింటే స్వీట్ కేక్ రెడీ. నచ్చితే మీరూ ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు.
బేకరీ కేక్‌తో అనారోగ్య భయమా? - "రాగి బెల్లం కేక్" ఇంట్లోనే ట్రై చేయండిలా!
బేకరీ స్టైల్ "వెనీలా స్పాంజ్ కేక్" - ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా లాగిస్తారు!
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!