Vankaya Mudda Kura Recipe : చాలా మందికి ఇష్టమైన కూరగాయలలో ఒకటి వంకాయ. అయితే, ఎక్కువ మంది గుత్తొంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ గుత్తొంకాయ వండడం వీలుకాదు. అందుకే ఓసారి ఈ "వంకాయ ముద్ద కూర"ను ట్రై చేయండి. చిన్న మసాలా పొడి ఈ కర్రీకి గుత్తొంకాయను మించిన టేస్ట్ అందిస్తుంది! అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గుండ్రటి వంకాయలు - పావుకేజీ
- టమాటాలు - 2 (మీడియం సైజ్‌వి)
- ఉల్లిపాయ - 1 (మీడియం సైజ్ది)
- ఆయిల్ - 3 టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు - అరటీస్పూన్
- మినప్పప్పు - అరటీస్పూన్
- ఆవాలు - పావుటీస్పూన్
- జీలకర్ర - పావుటీస్పూన్
- పచ్చిమిర్చి - 3
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
మసాలా కోసం :
- ధనియాలు - ఒకటిన్నర టీస్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- మెంతులు - చిటికెడు
- మిరియాలు - అరటీస్పూన్
- చింతపండు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 6
ఉడుపి "వంకాయ రస్వాంగి" కర్రీ - ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు!
తయారీ విధానం :
- ముందుగా లేత తెల్లని గుత్తొంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి క్యూబ్స్ మాదిరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆపై వాటిని ఒక బౌల్లో ఉప్పు నీరు తీసుకొని అందులో వేసి పక్కనుంచాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే కరివేపాకుని తుంచి వేసుకొని వేపుకోవాలి.
- ఆనియన్స్ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి.
- ఒకవేళ అడుగు మాడుతుందనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఉడికించుకోవాలి.
- వంకాయ ముక్కలు ఉడికే లోపు మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మరో బర్నర్‌పై కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. అవి వేయించుకునేటప్పుడే చింతపండు వేసి వేపుకోవాలి.
- అవి వేగాక మిక్సీ జార్‌లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడినే కర్రీ టేస్ట్‌ని మరింత పెంచుతుంది.
- వంకాయ ముక్కలు చక్కగా మగ్గాయనుకున్నాక అందులో కారం, గ్రైండ్ చేసుకున్న మసాల మిశ్రమం వేసుకొని కలుపుతూ రెండు నిమిషాల పాటు లో-ఫ్లేమ్ మీద నూనె కాస్త పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలి.
- ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "వంకాయ ముద్దకూర" రెడీ!